జోరుగా రబీ సాగు

Rabi cultivation in Andhra Pradesh as grand - Sakshi

ఈ ఏడాది సాగు లక్ష్యం 58 లక్షల ఎకరాలు 

ఇప్పటివరకు 19.53 లక్షల ఎకరాల్లో పంటల సాగు 

7.56 లక్షల ఎకరాల్లో శనగలు, 3.07 లక్షల ఎకరాల్లో మినుములు 

3.07 లక్షల ఎకరాల్లో వరి, 1.65 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న 

రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరందుకుంటోంది. నిర్దేశించిన లక్ష్యంలో మూడోవంతు విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. మాండూస్‌ తుపాను ప్రభావం ఈ పంటలపై స్వల్పంగా చూపింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో కొంతమేర పంటలు దెబ్బతినగా, ఆ మేరకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో రెండోసారి విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచారు.  

అనంతపురంలో 70 శాతం సాగు 
రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.29 లక్షల ఎకరాలు. 2020–21లో రికార్డు స్థాయిలో 62 లక్షల ఎకరాల్లో సాగవగా, 2021–22లో 56.27 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 58లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది ఇదే సమయానికి 18 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది ఇప్పటివరకు 19.53 లక్షల ఎకరాల్లో సాగైంది.

అత్యధికంగా అనంతపురం జిల్లాలో 70 శాతం మేర రబీ పంటలు సాగవగా, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం మేర పంటలు సాగయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ పనులు ఊపందుకున్నాయి. 

ఈసారి వరి సాగు లక్ష్యం 20.77 లక్షల ఎకరాలు 
రబీలో వరి సాధారణ విస్తీర్ణం 19.72 లక్షల ఎకరాలు. గత సీజన్‌లో 19.52 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈ ఏడాది 20.77లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 3.07లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది ఇదే సమయానికి 1.9 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అపరాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. 

11.75 లక్షల ఎకరాల్లో అపరాల సాగు 
ఇక ముతక ధాన్యాలు 8.02 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో సాగైంది. వీటిలో 1.65 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 82 వేల ఎకరాల్లో జొన్నలు సాగయ్యాయి. అపరాల విషయానికొస్తే.. ఈ ఏడాది 23.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 10.85 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.

వీటిలో ప్రధానంగా 7.56 లక్షల ఎకరాల్లో శనగలు, 3.07 లక్షల ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. అలాగే, నూనె గింజల సాగు లక్ష్యం 3.67లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా 1.05 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. ఇతర పంటల విషయానికొస్తే పొగాకు సాగు లక్ష్యం 1.75 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 87 వేల ఎకరాల్లో సాగైంది.  

సమృద్ధిగా ఎరువుల నిల్వలు 
రబీ సీజన్‌కు కేంద్రం 22.69 లక్షల టన్నుల ఎ­రువులు కేటాయించింది. ప్రారంభ నిల్వ 7.29 లక్షల టన్నులుండగా, గడిచిన 45 రోజుల్లో 7.82 లక్షల టన్నులను  కేంద్రం సరఫరా చేసింది. డిసెంబర్‌ 15 నాటికి 7.94 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి.

డిసెంబర్‌ నెలకు 3.34 లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 7.17లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. కేటాయింపు ప్రకారం డిసెంబర్‌ నెలకు మరో 3.95 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top