పక్షుల లెక్క 'తేలుద్దాం'

Popularity of bird counting has also increased in AP - Sakshi

ప్రారంభమైన పక్షుల గణన..

రాష్ట్రంలోనూ పెరుగుతున్న ఆదరణ 

పాల్గొంటున్న పలు విద్యాసంస్థలు, ఇతర సంస్థలు, వలంటీర్లు

ఈ గణనలో ఎవరైనా పాల్గొనవచ్చు

సాక్షి, అమరావతి: పక్షుల వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ‘గ్రేట్‌ బ్యాక్‌యార్డ్‌ బర్డ్‌ కౌంట్‌’ పేరిట ఏటా అంతర్జాతీయంగా నిర్వహించే పక్షుల గణనకు రాష్ట్రంలోనూ ఆదరణ పెరిగింది. ఫిబ్రవరి 11 నుంచి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్న ఈ గణనలో రాష్ట్రానికి చెందిన పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు భాగస్వాములయ్యాయి. తిరుపతి ఐఐటీ, ఎస్వీ యూనివర్సిటీ, ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాల, శ్రీకాకుళం జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖలోని ఇందిరాగాంధీ జూపార్క్‌ కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. అలాగే చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని పలువురు వలంటీర్లు క్యాంపస్‌ పక్షుల గణనలో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. విజయవాడ నేచర్‌ క్లబ్, విశాఖ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో సంస్థలు డబ్ల్యూసీటీఆర్‌ఈ, ఈసీసీటీలకు చెందిన వలంటీర్లూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పక్షుల గణన కార్యక్రమంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌)–తిరుపతి కీలక భాగస్వామిగా పనిచేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన పక్షుల గణనలో ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, ఎస్వీ జూపార్క్, రీజనల్‌ సైన్స్‌ సెంటర్, కేంద్రీయ విద్యాలయం పాల్గొని 215 పక్షి జాతులను నమోదు చేశాయి.

అంతర్జాతీయంగా క్రమం తప్పకుండా..
ఏటా ఫిబ్రవరిలో జరిగే ఈ పక్షుల గణనలో వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది పక్షుల అభిమానులు(బర్డ్‌ వాచర్స్‌) పాల్గొంటారు. ఇందులో భాగంగానే క్యాంపస్‌ బర్డ్‌ కౌంట్‌ పేరుతో విద్యా సంస్థలు, ఇతర సంస్థలు వాటి క్యాంపస్‌లలో పక్షుల గణన చేపడతాయి. పరిశీలకులు(బర్డ్‌ వాచర్స్‌) పక్షుల కదలికలను గమనించి వాటి ఫొటోలు తీసి https://birdcount.in/event/ cbc2021/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అంతర్జాతీయంగా క్రమం తప్పకుండా జరిగే ఈ పక్షుల బర్డ్‌ కౌంట్‌లో 2013 నుంచి మన దేశంలోని సంస్థలు పాల్గొంటున్నాయి. క్యాంపస్‌ పక్షుల గణనలో గతేడాది ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతి దేశంలోనే మూడో క్యాంపస్‌గా నిలిచింది.

పక్షుల వైవిధ్యం తెలుసుకునేందుకు దోహదం
దేశంలో పక్షుల వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. పక్షులపై అవగాహన ఉన్న ఎవరైనా 15 నిమిషాలపాటు వాటి కదలికలను గమనించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి వేలాదిమంది బర్డ్‌ వాచర్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.               
– ఐఐఎస్‌ఈఆర్‌ సిటిజన్‌ సైన్స్‌ కో–ఆర్డీనేటర్‌ రాజశేఖర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top