‘సాఫ్ట్‌’గా వ్యవసాయం..కష్టమన్నదే తెలియని సాగు

Pomegranate Crop In 16 Acres With Solar Energy - Sakshi

శరీర కష్టం స్ఫురింపజేసే వ్యవసాయాన్ని తన మేథోశక్తితో చాలా నాజుకుగా మార్చేశాడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆడుతూ.. పాడుతూ.. శరీర కష్టమనేది తెలియకుండా పంటల సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అంతేకాక పంట దిగుబడులను నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు చేపట్టి దళారీ వ్యవస్థకు మంగళం పాడాడు. సరికొత్త ఆలోచనతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేసిన భువనేశ్వర చక్రవర్తి విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.   

సాక్షి,  బెళుగుప్ప:  మండలంలోని తగ్గుపర్తి గ్రామానికి చెందిన దబ్బర నారాయణస్వామి, నిర్మల దంపతుల కుమారుడు భువనేశ్వర చక్రవర్తి.. బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ ప్రతి నెలా ఐదంకెల జీతం అందుకుంటున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వర్క్‌ఫ్రమ్‌ విధానం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశం దక్కింది. ఈ క్రమంలో తగ్గుపర్తికి చేరుకున్న భువనేశ్వర చక్రవర్తి... పంటల సాగులో తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసి, చలించిపోయాడు. ఏదైనా చేసి శరీర కష్టం తెలియని వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావించాడు.  

నల్లరేగడిలో పసిడి పంట 
తమకున్న 16 ఎకరాల నల్లరేగడిలో సంప్రదాయ పంటలనే సాగు చేస్తూ నష్టాలను చవిచూస్తున్న తరుణంలో భువనేశ్వర ప్రసాద్‌ పంటల సాగుపై దృష్టి సారించాడు. అదే సమయంలో తండ్రి ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. తీవ్ర వేదనలో ఉన్న తల్లి నిర్మలకు భువనేశ్వర్‌ అండగా ఉంటూ తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నల్లరేగడిలో బంగారు పంటలు పండించే మార్గాలను అన్వేషించాడు. ఆన్‌లైన్‌ అన్వేషణ ఫలించింది. మహారాష్ట్ర నుంచి భగువ రకం దానిమ్మ మొక్కలను తెప్పించి 2020లో ఆరు ఎకరాల్లో నాటాడు. విడతల వారీగా ఏడాది పొడవునా పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రచించి మొత్తం 16 ఎకరాల్లో దానిమ్మ మొక్కలు నాటాడు. 2021లో 11 నెలలకే కాపు కాసిన దానిమ్మ పంట తొలి కాపులోనే ఆరు ఎకరాల్లో 26 టన్నుల దిగుబడి సాధించాడు.

టన్ను రూ.60 వేలు నుంచి రూ.70 వేల వరకూ విక్రయించగా రూ.18 లక్షల ఆదాయం సమకూరింది. పెట్టుబడులకు రూ.4 లక్షలు పోను రూ.14 లక్షల నికర లాభం ఆర్జించాడు. అనంతరం ఆన్‌లైన్‌ యాప్‌ను రూపొందించి 2022లో మరో ఆరు ఎకరాల్లో కాపు కాసిన దానిమ్మను సొంతంగా బెంగళూరులోని పలు అపార్ట్‌మెంట్లలో నివాసముంటున్న వారికి సొంతంగా విక్రయించాడు. కిలో రూ.100 చొప్పున ఒక్కో అపార్ట్‌మెంట్‌కు వంద నుంచి 200 కిలోల వరకు బుక్‌ చేసుకుని ఐదు నుంచి పది కిలోల చొప్పున బాక్స్‌లను తోటలోనే ప్యాక్‌ చేయించి ఆర్టీసీ కార్గో సేవల ద్వారా బెంగళూరుకు తరలించేవాడు. రెండో విడత కాపులో 16 టన్నుల దిగుబడి సాధించి టన్ను రూ.90 వేల నుంచి రూ.1.10 లక్షల వరకూ విక్రయించాడు. ఈ లెక్కన రూ.16 లక్షల ఆదాయాన్ని గడించాడు. ఓ వైపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లికి చేదోడుగా నిలిచి పది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు.   

సూర్యరశ్మిని ఒడిసిపట్టి 
పంటల సాగుకు అవసరమైన నీటిని అందించేందుకు సంప్రదాయ విద్యుత్తును కాకుండా సౌరశక్తిపై భువనేశ్వర చక్రవర్తి ఆధారపడ్డాడు. సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసుకుని సూర్యరశ్మిని ఒడిసిపట్టడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తుతో 16 ఎకరాల్లోని దానిమ్మ తోటకు బిందు సేద్యం ద్వారా నీటి తడులు అందిస్తూ వస్తున్నాడు. వన్యప్రాణుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రాత్రిళ్లు వివిధ రకాల శబ్దాలు వచ్చేలా తోటలో స్పీకర్లు అమర్చాడు.

పంటను ఆశించే పండు ఈగలకు సోలార్‌లైట్‌తో ఎరలను ఏర్పాటు చేసాడు. దానిమ్మ పూలు మొత్తం ఫలదీకరణం చెందడానికి తోటలోనే తేనెటీగల పెంపకం చేపట్టాడు. దేశీయ పరిజ్ఞానంతో  తయారు చేసిన ఫసల్‌(ఎఫ్‌ఏఎస్‌ఏఎల్‌) యంత్రాన్ని రూ.50,000 ఖర్చుతో తోటలో అమర్చాడు. ఈ యంత్రానికి  13 రకాల సెన్సార్లు ఏర్పాటు చేసి శాటిలైట్‌ కనెక్టివిటితో వర్షసూచన, నేలలో తేమశాతం, పంటను ఆశించిన తెగుళ్లు, ఇతర సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు.  

ఏడాది మొత్తం దిగుబడే 
వ్యవసాయ కూలీలతో పంటలో సస్యరక్షణ చర్యలు చేపడుతుంటాను. నా కుమారుడి ఆలోచన వల్ల ఏడాది పొడవునా దానిమ్మ పంట చేతికందుతోంది. గతంలో పంటసాగుకు చాలా కష్టపడేవాళ్లం. ఇప్పుడా శ్రమ లేకుండా పోయింది.  
– నిర్మల, మహిళా రైతు, తగ్గుపర్తి   

దళారీ వ్యవస్థ ఉండరాదు  
పెద్ద కంపెనీలు సైతం దళారులతోనే పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పంట పండించిన రైతుకు కష్టం తప్ప ఆదాయం ఉండడం లేదు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. రైతులతో కంపెనీ ప్రతినిధులు నేరుగా సంప్రదించి పంట కొనుగోలు చేస్తే అన్నదాత కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.  
– భువనేశ్వర చక్రవర్తి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, తగ్గుపర్తి గ్రామంలోనే ఉపాధి 

భువనేశ్వర చక్రవర్తి సాగు చేసిన దానిమ్మ తోటలో నాతో పాటు మరో ఎనిమిది మంది కూలి పనులకు వెళుతుంటాం. ఏడాది పొడువునా మాకు పని ఉంటుంది. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోంది.  
– ప్రసాద్, వ్యవసాయ కూలీ, తగ్గుపర్తి గ్రామం   

(చదవండి: వధువు కావాలా.. నాయనా?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top