
కర్నూలు కల్చరల్: టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసుకు సంబంధించి సీఆర్‌పీసీ 41 (ఏ) కింద నేడు (ఆదివారం) నోటీసులు ఇవ్వనున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప తెలిపారు. నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు అధికారిగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ ఆధ్వర్యంలో అధికారుల బృందం వెళ్తుందని చెప్పారు. ఈ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. శనివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఈ నెల 6న టీవీ చానళ్లతో మాట్లాడుతూ కర్నూలు కేంద్రంగా ఎన్440కే అనే కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టిందని, అది 10 నుంచి 15 రెట్లు తీవ్రంగా వ్యాప్తి చెంది, మానవ నష్టం జరుగుతుందంటూ ప్రజలను భయపెట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ మాసుపోగు సుబ్బయ్య అనే వ్యక్తి కర్నూలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు.
ఈ మేరకు ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్లతో పాటు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్440కే వేరియెంట్‌ను సీసీఎంబీ గత ఏడాది జూన్‌లోనే గుర్తించిందన్నారు. దీనికి సంబంధించి కర్నూలులో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. దీనిపై ఇప్పటికే సీసీఎంబీ, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చాయని, శాస్త్రవేత్తలు సైతం ప్రస్తుతం దీని ప్రభావం లేదని నిర్ధారించారని తెలిపారు. కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లు, ప్రకటనలను కూడా ఎస్పీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపారు. ఎన్440కే వేరియంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వదంతులు, అసత్య ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.