పాలీహౌస్‌ల కోసం రోబోటిక్‌ స్ప్రేయర్‌

Non human spraying of liquid fertilizers and pesticides - Sakshi

మానవ రహితంగా ద్రవ ఎరువులు, పురుగుల మందుల పిచికారీ

రిమోట్‌ సాయంతో కిలోమీటర్‌ పరిధిలో పనిచేసే పరికరం

సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల పిచికారీకి సాంకేతిక పరిజ్ఞానం జోడించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ ఉద్యాన విశ్వ­విద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రోబోటిక్‌ స్ప్రేయర్‌ను అందు­బాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో పాలీహౌస్, గ్రీన్‌ హౌస్‌లలో ద్రవ రూప ఎరువులు, పురుగు మందులను మానవ రహితంగా పిచికారీ చేయొచ్చు.

పంటల వారీగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే నానో యూరియా, పురుగు మందులను ఈ పరికరం పిచికారీ చేస్తుంది. దీనిద్వారా 20 శాతం యూరియా, పురుగుల మందుల వినియోగం తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులు 25 శాతం వరకు ఆదా అవుతాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు. దిగుబడుల్లో నాణ్యత పెరగడంతోపాటు పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాల ప్రభావం ఉండదని కూడా తేల్చారు.

ప్రత్యేకతలివీ..
ఈ పరికరం రిమోట్‌ కంట్రోల్‌తో కిలోమీటర్‌ మేర పనిచేస్తుంది.
♦ ముందుగా కావాల్సిన రసాయన ఎరువు లేదా పురుగు మందులను తొట్టిలో వేసుకుని మెషిన్‌ ఆన్‌ చేసి రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌ను కనెక్ట్‌ చేసుకోవాలి. 
♦ రిమోట్‌ ద్వారా కమాండ్‌ సిగ్నల్స్‌ను అందిస్తే ఇది పని చేసుకుంటూ పోటుంది. రిమోట్‌ ద్వారా మెషిన్‌ దిశను మార్చుకోవచ్చు.
♦ కంట్రోలర్‌ బటన్‌ ద్వారా మెషిన్‌ వేగం, స్ప్రేయర్‌ పీడనం మార్చుకోవచ్చు. 
♦ మొక్క ఎత్తును బట్టి నాజిల్స్‌ను మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు.
♦ పురుగు మందులను ఏకరీతిన సరైన పరిమాణంతో ఆకుల మీద పడేలా చేయటం దీని ప్రత్యేకత.
♦ తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల పురుగు మందుల వృథాతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవచ్చు.
♦ 10–20 లీటర్ల లిక్విడ్‌ యూరియా, పురుగుల మందులను మోసుకెళ్తూ నిమిషానికి 6 లీటర్లను పిచికారీ చేయ­గల సామర్థ్యం ఈ పరికరానికి ఉంది.

కృత్రిమ మేధస్సుతో..
కృత్రిమ మేధస్సు­తో పనిచేసే పరిక­రాలు, మొబైల్‌ అప్లికేషన్స్, సెన్సార్లు, డ్రోన్స్, ఆటోమేటిక్‌ యంత్ర పరిక­రాలు, వివిధ సాఫ్ట్‌వేర్స్‌ రూపక­ల్ప­న కోసం ఆదికవి నన్నయ, జేఎన్‌­టీ­యూకే, ఎన్‌ఐటీలతో ఒప్పందాలు చే­సు­కున్నాం. ఇందులో భాగంగా ఉద్యా­న పరిశోధనా స్థానం శాస్త్రవే­త్తలు, ఇంజ­నీర్లు ప్రోటోటైప్‌ రోబోటిక్‌ స్ప్రే­యర్‌ను అభివృద్ధి చేశారు. ఇందు­లో మార్పుచేసి మరింత అభివృద్ధి చేయా­లని నిర్ణ­యిం­చాం. ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ ద్వా­రా మొక్కల వ్యాధులు, తెగుళ్లను గుర్తించడంపైనా పరిశోధనలు జరుగు­తున్నాయి. – డాక్టర్‌ తోలేటి జానకిరామ్,  వీసీ, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top