శుద్ధ అబద్ధం: మినరల్‌ కాదు జనరల్‌ వాటరే 

No Quality In Water Plants Only Normal Water Not Mineral Water - Sakshi

వాటర్‌ ప్లాంట్లలో నాణ్యతకు తిలోదకాలు\

నీళ్లు సరఫరా చేసే క్యాన్ల శుభ్రత పట్టని వైనం

వాటర్‌ప్లాంట్ల నియంత్రణపై పర్యవేక్షణ శూన్యం 

ఫ్లోరైడ్‌.. ఉప్పు నీటినుంచి ఉపశమనం కోసం ప్రజలు శుద్ధనీటి వైపు మళ్లారు. స్థానిక సంస్థల ద్వారా సరఫరా అయ్యే నీటిని రోజువారీ అవసరాలకు వినియోగిస్తున్నారు. తాగడానికి అత్యధిక శాతం మంది శుద్ధ్ధనీటిపైనే ఆధారపడుతున్నారు. ఫిల్టర్‌ చేసిన నీరు రుచికరంగా అనిపిస్తుండటంతో ఎక్కువ మంది వాటినే తాగుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల వరకే ఉన్న ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ (శుద్ధ జలం) ప్లాంట్లు గ్రామాలకూ విస్తరించాయి. మినరల్‌ వాటర్‌ అని పైకి చెప్పినా జనరల్‌ వాటర్‌నే పైపైన ఫిల్టర్‌ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. ఐఎస్‌ఐ ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. అధికారులు కూడా తమకేమీ     పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ సంస్కృతి విస్తరించింది. ఇల్లు, దుకాణాలు, హోటళ్లు, టీ కేఫ్‌లు, కార్యాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా ప్యూరిఫైడ్‌ క్యాన్‌ వాటర్‌ దర్శనమిస్తున్నాయి. ఈ క్యాన్‌లోనివి మినరల్‌ నీళ్లు అని, స్వచ్ఛమైనవని సేవిస్తున్నారు. అయితే ఇవి అంత శుద్ధమైనవి కాదని అధికారుల తనిఖీల్లో ఎన్నోసార్లు రుజువైంది. ఉమ్మడి జిల్లాలో 44 లక్షల మందికి పైగా జనాభా ఉంటే రోజూ 25 లక్షల మంది ప్యూరిఫైడ్‌ నీటినే వాడుతున్నట్టు అంచనా. జిల్లాలో వెయ్యికి పైగా వాటర్‌ ప్లాంట్లు ఉంటే.. అందులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఐఎస్‌ఐ గుర్తింపు పొందినవి మూడు మాత్రమే. మిగిలినవన్నీ ప్రమాణాలు పాటించకుండానే కొనసాగుతున్నాయి. 

ప్లాంట్లపై పర్యవేక్షణ లేదు 
రూ.కోట్లల్లో వ్యాపారం నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లపై పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ఈ నీటిని ఎవరైనా నమూనాలను సేకరించి నిర్ధారించి అనుమతులు ఇస్తున్నారా? ఈ నీళ్లను శుద్ధి చేస్తున్నారా లేదా? ఇవి సురక్షిత నీరేనా? అని చూసేవారు లేరు. కొన్నిసార్లు నీళ్ల క్యాన్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ఫిర్యాదులు కూడా అందాయి. ఇలా ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్ల పేరిట జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. పలు సందర్భాల్లో డయేరియా కేసులు నమోదవుతూ ఉండటంతో ఈ నీళ్లపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌ప్లాంట్‌ నుంచి గృహాలకు చేరే 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ను 90 సార్లకంటే ఎక్కువగా వాడకూడదు. కానీ ఇక్కడ మూడేళ్లు దాటినా అవే క్యాన్లను వినియోగిస్తూనే ఉన్నారు.  

నీటి శుద్ధి ఇలా జరగాలి.. 
ఆర్‌ఓ ప్లాంట్‌ ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఆర్‌ఓ అంటే రివర్స్‌ ఓస్మోసిస్‌. బోరు నుంచి వచ్చే నీటిలో మోతాదుకు మించి మినరల్స్‌ ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఉంటే హాని కలిగిస్తాయి. వీటిలో     మెగ్నీíÙయం, రకరకాల సల్ఫేట్స్, బోరాన్, బేరియం, మాంగనీస్‌ వంటివి ఉంటాయి. ఎక్కువ మోతాదులో మినరల్స్‌ కలిగి ఉన్న నీటినే భారజలం అంటాం. టీడీఎస్‌ (టోటల్‌ డిస్పెన్స్‌డ్‌ సాలిడ్స్‌) అనికూడా అంటాం. వీటిని ఆర్‌ఓ ప్లాంట్లు వడపోత నిర్వహించి భారజలాన్ని సాధారణ జలంగా మార్చాలి. వంద లీటర్లను ఆర్‌ఓ ద్వారా ఫిల్టర్‌ చేస్తే మనకు పది నుంచి 15 లీటర్లు మాత్రమే తాగునీరు వస్తుంది. ఇందులో మూడు దశల్లో వడపోత జరగాలి. ఆర్‌ఓలో ప్రీ ఫిల్టరైజేషన్‌ సాలిడ్‌ వాటర్‌ మొదటి దశ, ఉప్పుశాతాన్ని తగ్గించడం రెండోదశ. ఇక మూడోదశలో బ్యాక్టీరియాను తగ్గించే వడపోత ఉంటుంది. ఈ మూడు దశల్లో ఏది సరిగా జరగకపోయినా ఉపయోగం ఉండదు. నాణ్యమైన తాగునీరు కావాలంటే ఈ ఆర్‌ఓ ప్లాంట్లలో వాడే ఫిల్టర్లను తరచూ మారుస్తూ ఉండాలి. అయితే వీటిని ఎక్కడా పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

మూడు ప్లాంట్లకే ఐఎస్‌ఐ మార్క్‌ 
జిల్లాలోని మూడు వాటర్‌ ఫిల్టర్‌ ప్లాంట్లకు మాత్రమే ఐఎస్‌ఐ అనుమతి ఉంది. మిగతావన్నీ ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ పేరుతో నడుస్తున్నవే. ఈ ప్లాంట్లపై ఫిర్యాదులొస్తే తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్యాకేజీ డ్రింకింగ్‌ వాటర్‌ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం మాకుంది. కానీ ఇలా 20 లీటర్ల క్యాన్‌లతో లూజ్‌ వాటర్‌ సరఫరా చేసే వాటిపై స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలి. అయినా మేం తరచూ ఈ ప్లాంట్ల నమూనాలపై నిఘా పెట్టాం. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. 
–దేవరాజు, ఫుడ్‌సేఫ్టీ అధికారి 

నిబంధనలు పాటించరు 
ఐఎస్‌ఐ నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ, కాలుష్య నియంత్రణమండలి సరి్టఫికెట్‌ తదితర వాటితో వస్తే రాయితీలు ఇస్తాం. కానీ ఈ ప్రమాణాలు పాటించరు కాబట్టి మా దగ్గరకు రారు. ప్లాంటు ఏర్పాటుకే కాదు, నాణ్యత పాటిస్తే విద్యుత్‌ రాయితీ కూడా ఇస్తాం. ఈ నిబంధనలు పాటించే ప్లాంట్లు లేవనే చెప్పాలి 
–నాగరాజారావు, జనరల్‌ మేనేజర్, పరిశ్రమల శాఖ 

వ్యాధులు సంక్రమిస్తాయి 
శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్‌ ఏ, డిసెంట్రీ (చీము రక్తంతో విరేచనాలు), కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందువల్ల నీటి శుద్ధి గురించి అందరూ తెలుసుకోవాలి. టోటల్‌ డిసాల్వ్‌ సాలిడ్స్‌(టీడీఎస్‌) 100 నుంచి 300 శాతం లోపు ఉండాలి. ఇది తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అలాంటి నీటిని వాడుకోవడం హానికరం. 
– డాక్టర్‌ రజిత, క్యాజువాలిటీ మెడికల్‌ అధికారి, అనంతపురం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top