ఈ ఏడాదీ అదే కూలి! | No increase in wages for workers under the Employment Guarantee Scheme | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదీ అదే కూలి!

Jun 30 2026 4:42 AM | Updated on Jun 30 2026 4:42 AM

No increase in wages for workers under the Employment Guarantee Scheme

ఉపాధి హామీ పథకం కూలీలకు పెరగని వేతనం 

ఏటా ఏప్రిల్‌ ఒకటి నుంచి పెరుగుదల

కొత్తగా వచ్చిన వీబీ జీ రామ్‌ జీ పథకంలో వేతనాలు పెంచుతారని మూడు నెలలుగా ప్రచారం 

రేపటి నుంచే కొత్త పథకం అమలు.. కానీ వేతన రేట్లు పెంచని ప్రభుత్వాలు

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ ఏడాదీ పాత కూలినే చెల్లించనున్నారు. ఏటా పెరిగే రోజువారీ వేతనం ఈ ఏడాది పెరగలేదు. ప్రతిఏటా ఆర్థిక ఏడాది మొదలయ్యే ఏప్రిల్‌ ఒకటో తేదీకల్లా ఉపాధి కూలీల రోజువారీ వేతనాన్ని పెంచుతారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వీబీ జీ రామ్‌ జీ పథకం ప్రవేశపెట్టడంతో కొత్త పథకం అమల్లోకి వచ్చే తేదీకల్లా వేతనాలు పెరుగుతాయని అధికారులు చెబుతూ వచ్చారు. 

ఈ కారణంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 1న వేతనాలు పెంచలేదు. బుధవారం (జూలై 1) నుంచే వీబీ జీ రామ్‌ జీ పథకం అమల్లోకి వస్తోంది. కొత్త పథకం అమలు గడువుకు ఒక్క రోజు వ్యవధి కూడా లేదు. అయినా సోమవారం సాయంత్రం వరకు ఉపాధి కూలీల వేతనం పెంపుపై నిర్ణయం వెలువడలేదు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.89 పెరిగిన వేతనం 
2006లో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పని చేసే ఒక్కో పని దినానికి చెల్లించే గరిష్ట కూలి రేటు రూ. 80గా ఉండేది. ఇది ఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.307కు పెరిగింది. 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలోనే ఐదేళ్లలో ఈ మొత్తం రూ. 89 మేర పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఒక్కో పని దినానికి చెల్లించే గరిష్ట వేతనం రూ. 211 కాగా.. 2024 ఏప్రిల్‌ నాటికి రూ. 300 వరకు పెరిగింది. 

ఆ తర్వాత గత రెండేళ్లలో రాష్ట్రంలో ఉపాధి కూలీలకు రోజు వారీ చెల్లించే గరిష్ట కూలి రూ.7 మాత్రమే పెరగడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్‌ 1న రూ. 307కు పెరగ్గా, ఈ ఏడాది రూపాయి కూడా పెంచలేదు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే  దాదాపు 47 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పనులు చేసుకొని జీవనం సాగిస్తుంటారు. వేతనం పెంచకపోవడం తమను ఆర్థికంగా దెబ్బ తీస్తుందని ఉపాధి హామీ కూలీల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement