ఈ నెలలో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం

Nellore Sangam barrages will start in August Says Ambati Rambabu - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారని వెల్లడించిన మంత్రి అంబటి 

రాపూరు: నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీటిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం వద్ద ఆదివారం ఆయన జిల్లా ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో జరుగుతున్న, జరగాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు, సంగం బ్యారేజీలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, వీటిని ఆయన కుమారుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పారు. తెలుగుగంగ కాలువ ద్వారా నీరందని చెరువులకు ఎత్తిపోతల పద్ధతిలో నీరిస్తామని తెలిపారు. 

కండలేరు, సోమశిల కాలువల పనులు పునఃప్రారంభిస్తాం 
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నీటిపారుదల రంగంలో సమస్యల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. వైఎస్‌ రాజÔశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటిపారుదలశాఖలో జరిగిన అభివృద్ధి ఆ తరువాత ఆగిపోయిందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తరువాత మళ్లీ కదలిక వచ్చిందని తెలిపారు. సోమశిల, కండలేరు జలాశయాల కాలువల పనులను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ సోమశిల–స్వర్ణముఖి (ఎస్‌ఎస్‌) లింకు కాలువ పనులను ప్రారంభించాలని కోరారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ కాలువ పనుల్ని అటవీ అనుమతులు లేవని గత ప్రభుత్వం నిలిపేసిందని చెప్పారు. కండలేరు డ్యాం నుంచి లి‹ఫ్ట్‌ ద్వారా వెలుగోను, రాపూరు చెరువుల మీదుగా ఆలూరుపాడుకు కాలువ తవ్వేందుకు, పోకూరుపల్లి రైతులకు లిఫ్ట్‌ ఇరిగేషçన్‌ ద్వారా నీరందించేందుకు రూ.528 కోట్లతో ప్రతిపాదనలు పంపామని చెప్పారు.

ఈ పనుల్ని ప్రారంభించేందుకు, మద్దెలమడుగులో 18 అడుగుల వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తీసుకురావాలని కోరారు. అంతకుముందు మంత్రులు కండలేరు హెడ్‌రెగ్యులేటర్‌ను, ఫొటో ఎగ్జిబిçషన్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో జేసీ కూర్మనాథ్, నీటిపారుదలశాఖ సీఈ హరినారాయణరెడ్డి, సోమశిల ఎస్‌ఈ రమణారెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్, జిల్లా పరిçషత్‌ ఉపాధ్యక్షురాలు ప్రసన్న, రాపూరు ఎంపీపీ చెన్నుబాలకృష్ణారెడ్డి, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top