మాసివ్‌ హార్ట్‌ఎటాక్‌తోనే కుప్పకూలిన తారకరత్న! | Nandamuri Tarakaratna Heart Attack: Health Bulletin Updates | Sakshi
Sakshi News home page

మాసివ్‌ హార్ట్‌ఎటాక్‌తోనే కుప్పకూలిన తారకరత్న.. బెంగళూరుకు తరలింపు!

Jan 27 2023 3:43 PM | Updated on Jan 27 2023 6:10 PM

Nandamuri Tarakaratna Heart Attack: Health Bulletin Updates - Sakshi

తారకరత్న హార్ట్‌లో రెండు వైపులా మొత్తం 95 శాతంగా బ్లాక్స్‌ ఉన్నట్లు.. బెంగళూరు ఆస్పత్రికి తరలింపు..  

సాక్షి, చిత్తూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఏస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందుతుండగా.. బెంగళూరు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం కుప్పంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువ గళం పాదయాత్ర మొదలు సందర్భంగా.. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే..

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్‌లు వేయలేదు. యాంజియోగ్రామ్‌ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్‌ వేస్తారా?.. ఇతర ట్రీట్‌మెంట్‌లు అందిస్తారా? అనేది వేచిచూడాలి. తారకరత్నకు భారీగా గుండెపోటు వచ్చిందని, అయితే ఆస్పత్రిలో వైద్యులు 40 నిమిషాలపాటు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారాయన.  

బాలకృష్ణ రాకతో ఆయన రికవరీ కావడం ఆశ్చర్యంగా ఉందని, బాలకృష్ణే దగ్గరుండి చూసుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తారకరత్నకు ప్రాణాపాయం తప్పిందని భావనలో ఉన్నామని బుచ్చయ్యచౌదరి చెప్పారు.  అవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు ఎయిర్‌లిఫ్ట్‌ చేస్తారు.  ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని, తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. 

ఇక పరిస్థితిపై సీనియర్‌ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తారకరత్నకు మాసివ్‌ హార్ట్‌ ఎటాక్‌ లెఫ్ట్‌ సైడ్‌ వచ్చిందని తెలిపారు. ఎడమ వైపు 90 శాతం బ్లాక్‌ అయ్యింది. అయితే మిగతా రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పరిస్థితి మెరుగవుతోందని, వైద్యులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయినప్పటికీ బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి పాజిటివ్‌గానే ఉందని, దేవుడి దయతో పాటు కుటుంబం సభ్యుల ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో.. ఆయన మండిపడ్డారు. 

అంతకు ముందు.. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తారకరత్నను గ్రీన్‌ఛానల్‌ ద్వారా కుప్పం ఈపీఎస్‌ ఆస్పత్రి నుంచి బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement