
రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా..
సాక్షి, విశాఖపట్నం: త్వరలో వైజాగ్ వేదికగా జరగబోయే గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రంలోని యువత ఉపాధి అవకాశాలకు సంబంధించి గేమ్ ఛేంజర్ కాబోతోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. సదస్సు జరగనున్న ఏయూ గ్రౌండ్స్ ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించిన మంత్రి అమర్నాథ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న పెట్టుబడుదారుల సదస్సు ఇది. పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు సీఎం జగన్ కూడా ఈ సదస్సుకు హాజరవుతారు. అందుకే ఏర్పాట్లను పరిశీలించాం. సదస్సుకు సంబంధించి చెన్నై, బెంగుళూర్‌లో రోడ్డు షో జరిగాయి. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్(తెలంగాణ) లో కూడా సదస్సుపై.. ఏపీలో అవకాశాలపై షో కేస్ చేస్తాం. ఇప్పటికే పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలిసి ఏపీలో అవకాశాలపై వివరించాం అని మంత్రి అమర్నాథ్ తెలిపారు.
ఏపీలో పద్నాలుగు పారిశ్రామిక రంగాల్లో అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పిన ఆయన.. వాటిల్లో టూరిజం, హోటల్, ఇన్ ఫ్రా, ఫార్మా రంగాలపై ఎక్కువ ఫోకస్ ఉందని వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై.. తాము (ప్రభుత్వం) చెప్పడం కంటే, పారిశ్రామిక వేత్తలు నేరుగా చూడాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
సుమారు 60 దేశాలకు చెందిన పరిశ్రమలు ఏపీలో ఇప్పుడు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలే ఈ సదస్సు ద్వారా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించబోతున్నారని తెలిపారాయన. ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా 20 దేశాలు ఏపీతో భాగస్వామ్యం కాబోతున్నాయి. మరోవైపు ఈ సదస్సుతో రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయని తెలిపారాయన. అలాగే..
కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ నెంబర్ ఒన్ స్థానంలో వుంది. దేశం అంతా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు కొనసాగుతుంటే.. ఏపీలోనే మూడు కారిడార్లు ఏర్పాటు కాబోతున్నాయి. దాదాపు లక్షా యాభై వేల కోట్ల ఎగుమతులు ఏపీలో జరుగుతున్నాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. అలాగే.. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వర్గాలకు.. మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏంఎస్ఏం ఈ ప్రాజెక్ట్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం
ఐటీకి సంబంధించి వైజాగ్, అనంతపురం, తిరుపతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, భోగాపురం(విజయనగరం) వద్ద వంద ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించిన విషయాన్ని మంత్రి అమర్నాథ్ ప్రస్తావించారు. గతం మాదిరిగా కాగితాల మీద పెట్టుబడుల గొప్పలు చెప్పుకోబోమని టీడీపీకి మంత్రి అమర్నాథ్ చురకలంటించారు. టీడీపీ చెప్పుకుంటున్న లక్షల కోట్ల పెట్టుబడుల్లో పది శాతం అంటే.. లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు నుంచే ప్రారంభిస్తామని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.