పండగపూట ఆలయాల వద్ద భోజనం చేసిన విద్యార్థులు
కోవెలకుంట్ల: సంక్షేమ వసతి గృహాల్లో పండగపూట విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంతో ఆలయాల వద్దకు వెళ్లి భోజనం చేసి కడుపు నింపుకొన్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని గుళ్లదూర్తి బీసీ బాలుర వసతి గృహాల్లో శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేశారు. దీంతో చేసేదేమీ లేక 70 మంది విద్యార్థులు హాస్టల్ సమీపంలోని చిన్నమ్మ ఆశ్రమంలో సీతారాముల కల్యాణం సందర్భంగా భోజనం చేసేందుకు అక్కడికి వెళ్లారు.
రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆళ్లగడ్డ వార్డెన్ ఎర్రమ్మకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె చుట్టపుచూపుగా హాస్టల్‌కు వస్తోందన్న విమర్శలున్నాయి. అలాగే మరో బీసీ బాలుర వసతిగృహంలో 70 మందికి పైగా విద్యార్థులుండగా ఆన్‌లైన్ హాజరు అనంతరం పిల్లలను స్థానిక శ్రీరాంనగర్‌లోని రామాలయం వద్దకు మధ్యాహ్న భోజనానికి పంపారు.
ఆదేశాలను బేఖాతరు చేస్తూ..
పాఠశాలల పనివేళల్లో హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో, ఉదయం టిఫిన్, రాత్రి భోజనం హాస్టళ్లలో అందజేయాల్సి ఉంది. సెలవు రోజుల్లో మధ్యాహ్న భోజనం కూడా హాస్టల్‌లోనే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటి ఆహారాన్ని హాస్టళ్లలోకి అనుమతివ్వొద్దని ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఆదేశాలను బేఖాతర్ చేసిన ఆ హాస్టల్ వార్డెన్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయమై ఇన్‌చార్జ్ ఏబీసీడబ్ల్యూవో మునిరాజును వివరణ కోరగా పాఠశాలల సెలవు రోజుల్లో హాస్టళ్లలోనే విద్యార్థులకు మూడు పూటలా భోజనం పెట్టాలన్నారు. కోవెలకుంట్ల, గుళ్లదూర్తి హాస్టళ్లలో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని చెప్పారు.


