అద్దెకు మార్కెటింగ్‌ శాఖ గోడౌన్లు 

Marketing department godowns for rent - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 216 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో 9,75,105 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 1,059 గోదాములు ఉన్నాయి. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునేవారు.

మిగిలిన గోడౌన్లను ప్రభుత్వరంగ సంస్థలైన సివిల్‌ సప్లయిస్, రాష్ట్ర గోదాముల సంస్థకు అద్దెకు ఇచ్చేవారు. అయినప్పటికీ మరికొన్ని గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో నిల్వ చేసుకునే వెసులుబాటును మార్కెటింగ్‌ శాఖ కల్పిస్తోంది. తద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి వీటిని అద్దెకు ఇస్తారు. 

చదరపు అడుగుకు రూ.5పైగా అద్దె వస్తేనే..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,53,639 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 258 గోదాములను చదరపు అడుగు రూ.5కు మించి ఎవరు కోట్‌ చేస్తారో వారికి అద్దెకిచ్చేందుకు ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ అయింది. అత్యధికంగా గుంటూరులో 44, అత్యల్పంగా విశాఖపట్నంలో 4 గోదాములు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు విజయ నగరంలో 1, పశ్చిమ గోదావరిలో 7, వైఎస్సార్‌ జిల్లాలో 6 గోడౌన్లను చదరపు అడుగుకు రూ.6 చొప్పున చెల్లించి అద్దెకు తీసుకునేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మిగిలిన వాటిని కూడా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు లీజుకిచ్చేందుకు మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top