భళా బూడిద..!

Manufacture of aggregate from fly ash from thermal power plants - Sakshi

సాక్షి, అమరావతి:  బూడిద అనగానే ఎందుకూ పనికిరాదని తేలిగ్గా తీసేస్తాం. కానీ, అలా తీసిపడేసిన బూడిదతోనే కంకర తయారు చేసి పటిష్టంగా రహదారులు, భవనాలను నిర్మించవచ్చు. అది కూడా సిమెంటు అవసరం లేకుండానే. ఈ మేరకు నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్‌ చేసిన ప్రయోగం ఫలించింది. దీనివల్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే బూడిదతో ఇబ్బందులు తొలగి జీవరాశులకు, పర్యావరణానికి మేలు కలుగనుంది. రోడ్లు, భవనాల నిర్మాణంలో ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. బూడిద విక్రయాల వల్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు ఆదాయమూ పెరగనుంది. 

ఫలించిన పరిశోధనలు 
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థాల్లో బూడిద (ఫ్లై యాష్‌) ప్రధానమైంది. దేశంలో బొగ్గుతో నడిచే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఏటా సుమారు 258 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇందులో 78 శాతం బూడిదను సిమెంట్, సిరామిక్‌ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. బూడిద స్వభావాన్ని బట్టి వేరుచేసి టన్ను రూ.80 చొప్పున విక్రయిస్తారు. మిగిలినది యాష్‌ పాండ్లలో మిగిలిపోతుంది.

అది గాలి, నీరులో కలిసి వాటిని కలుషితం చేస్తోంది. ఫలితంగా వాతావరణం దెబ్బతిని, దాని ప్రభావం జీవరాశులపై పడుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించాలని ఓ వైపు ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుతం వస్తున్న బూడిద వినియోగంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్‌... బూడిదను ఉపయోగించి జియో పాలిమర్‌ ముతక కంకరను అభివృద్ధి చేసింది.

ఈ కంకర జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సిమెంట్, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ (ఎన్‌సీసీబీఎం) ధ్రువీకరించింది. ఇది సహజ కంకరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఏటా దేశంలో 2వేల మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కంకరకు డిమాండ్‌ ఉంటుంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదతో చేసిన కంకర ఈ డిమాండ్‌ను చాలావరకు తీర్చే అవకాశం ఉంది. రాతి కంకర కోసం కొండలు, భూమిని తవ్వడం వల్ల ఏర్పడే పర్యావరణ అసమతౌల్యాన్ని కూడా తగ్గిస్తుంది.  

ఖర్చు తగ్గుతుంది 
జియో పాలిమర్‌ కంకర ఉపయోగించినప్పుడు సిమెంట్‌ అవసరం లేదు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే బూడిద ఆధారిత జియోపాలిమర్‌ కంకరే బైండింగ్‌ ఏజెంటుగా పని చేస్తుంది. ఈ కంకర కర్బన ఉద్గారాలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది.

మరోవైపు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన బూడిదను మూడేళ్లలో వంద శాతం వినియోగించాలి. అందువల్ల త్వరలోనే జియో పాలిమర్‌ కంకర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top