రైతాంగాన్ని మరింత బలోపేతం చేస్తాం

ఖరీఫ్‌లో మొత్తం 65.9 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల సమీకరణ
రూ.9,900 కోట్లతో మౌలిక వసతులు
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన మార్పులతో రానున్న కాలంలో రైతాంగం మరింత బలోపేతమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్‌లో పండించిన పంటలకు సంబంధించి రాష్ట్రంలో 62 లక్షల టన్నుల వరి సహా వివిధ వ్యవసాయ ఉత్పత్తులు కలిపి మొత్తం 65 లక్షల 90 వేల టన్నులను సమీకరిస్తామన్నారు. సమీకరించిన వాటికి కేవలం 10 రోజుల్లోనే నగదు వారి ఖాతాల్లో జమయ్యే విధంగా చేస్తామన్నారు.
వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.9,900 కోట్లతో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,815 ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇవి నిరంతరం పనిచేస్తాయన్నారు. దీంతోపాటు 4,954 రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణ విధానం అమలు చేస్తామన్నారు. దీనిలో రైతులను బృందంగా ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడే యంత్రాలను అందజేస్తామన్నారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి జూన్ నుంచి సెపె్టంబర్ వరకు పంట నష్టం వివరాలు అందాయన్నారు. అక్టోబర్‌లో జరిగిన నష్టాలను ఈనెల 17లోపు లెక్కించి పరిహారం అందజేస్తామని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి