వ్యవసాయంలో ఏపీ టాప్‌

Kurasala Kannababu Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారు

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

మహారాణిపేట (విశాఖ దక్షిణ): దేశంలో వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని కేంద్రం ప్రకటించిన నాటినుంచి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు చెప్పారు. చంద్రబాబు లాంటి అబద్దాలకోరు దేశంలో ఎవరూ లేరన్నారు. ఆయన అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారని చెప్పారు. విశాఖలో ఆదివారం మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతులంటూ మొసలి కన్నీరు పెడుతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతిగా ముద్రపడ్డారని, నిత్యం రైతులకు మేలుచేయాలన్న ఆలోచనతో ఉన్నారని చెప్పారు. విత్తనాల నుంచి విక్రయాల దాక ప్రభుత్వం దగ్గర ఉండి నడిపిస్తోందన్నారు. పంట పెట్టుబడి నుంచి పంట విక్రయించే వరకు రైతులకు అండగా ఉండాలన్న ఆశయంతో నడుస్తున్న వైఎస్సార్‌ సీపీ సర్కార్‌పై చంద్రబాబు ఈర‡్ష్యతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఎరువులు, విత్తనాల కొరత ఉందేమోగానీ ఆంధ్రప్రదేశ్‌లో కొరత లేదన్నారు. పంట నష్టాలను చెల్లిస్తూ ఆదరణ పొందుతున్న సర్కార్‌పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రతి గ్రామంలో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే అధికారులు, గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం బీమా సొమ్ము రూ.2,500 కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు నేరుగా పథకాలు వర్తిస్తున్నాయన్నారు. పంట పెట్టుబడి కోసం రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నారని చెప్పారు.

1.39 లక్షల మంది సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్‌ పూర్తిచేస్తామని, అప్పటి నుంచి వారి సర్వీసు రెగ్యులర్‌ అవుతుందని తెలిపారు. కానీ కొంతమంది సచివాలయ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేబుల్‌కు నెలకు రూ.150 పైన చెల్లిస్తామని, కానీ ఇంటినుంచి చెత్త తీసుకెళ్లే వారికి మాత్రం నెలవారీ డబ్బులు ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్నించారు. చెత్తపన్ను చెల్లించడం భారం అయితే ప్రభుత్వం పునరాలోచన చేస్తుందన్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top