మరో 6 నెలలు.. నిరుపేదలకు ఉచితంగా రేషన్‌ బియ్యం

Kakinada District: Another Six Months Free Ration ‌Rice for Poor People - Sakshi

ఇటీవల ప్రకటించిన కేంద్రం

ఒక్కో లబ్ధిదారుకు ఐదు కిలోలు

మూడు జిల్లాల పరిధిలో 16.81 లక్షల బియ్యం కార్డుదారులకు లబ్ధి

కాకినాడ సిటీ: కరోనా కష్టకాలంలో ఉచిత రేషన్‌ బియ్యాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఈ పథకాన్ని పొడిగించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో నిరుపేదలు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ లేనప్పటికీ అర్హులైన బియ్యం కార్డుదార్లు ఒక్కక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలోని 64 మండలాల్లో 6.81 లక్షల మంది రేషన్‌ కార్డుదార్లకు బియ్యం అందజేయడానికి కావల్సిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

ఈ నెల నుంచే కొనసాగింపు 
పేదలకు బియ్యాన్ని పంపిణీ చేయాలంటూ ఒక నెల ముందు నుంచే ఇండెంట్లను పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఈ నెలలో ఉచితంగా 5 కిలోల బియ్యం లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత వచ్చే నెల నుంచి అక్టోబర్‌ వరకూ కూడా ఉచితంగా బియ్యం ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ఇండెంట్లను ముందస్తుగా స్వీకరించే పనిని అధికారులు ఇప్పటికే చేపట్టారు.

16.81 లక్షల కార్డులు
అవిభక్త తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 64 మండలాల్లో 2,659 రేషన్‌ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో రైస్‌కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిపి మొత్తం 16.81 లక్షలు ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం చొప్పున కేటాయించడంతో ఈ నెల నుంచి ఉచితంగా ఇవ్వనున్నారు. సేల్స్‌ డిపోల డీలర్ల వద్ద గతంలో నిల్వ ఉన్న బియ్యం పోగా మిగిలినవి అందిస్తారు.

జిల్లాలోని గోదాముల నుంచి ఆయా రేషన్‌ డిపోల వారీగా బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందులో అంత్యోదయ కార్డుకు గతంలో 35 కిలోల బియ్యం అందించేవారు. ఇప్పుడు అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తం 40 కిలోల బియ్యం అందిస్తారు. అలాగే అన్నపూర్ణ కార్డుదారుకు 5 కిలోల ఇచ్చేవారు. ఈ నెల నుంచి 15 కిలోలు పంపిణీ చేస్తారు. అలాగే ఒక్కో సాధారణ బియ్యం కార్డుదారుకు 5 కిలోల బియ్యం ఇస్తుండగా ఈ నెలలో గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (కరోనా బియ్యం) పథకం కింద 5 కిలోల చొప్పున ఉచితంగా అందించనున్నారు. మొత్తంగా అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి నెలా 22,219 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందజేయనుంది.

సంతోషంగా ఉంది
మరో ఆరు నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. దీంతో పేదల కుటుంబ పోషణకు కొంత మేర ఊరట కలుగుతుంది. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వడం అభినందనీయం, కరోనా పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే వరకూ బియ్యం ఉచితంగా ఇవ్వాలి.
– దంగేటి అప్పయ్యమ్మ, కాకినాడ 

సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలి 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని డీలర్లు సక్రమంగా పంపిణీ చేయాలి. రేషన్‌ ఇచ్చే సమయంలో కార్డుదారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ బియ్యం ఎంతో ఉపయోగపడుతాయి.
– ఐవీ రమణ, కాకినాడ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top