ఇబ్రహీంపట్నంలోని ఇంటి వద్ద జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు
తెల్లవారుజామున 4.30 గంటలకే ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు
మూడున్నర గంటలపాటు హైడ్రామా..
వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసనల మధ్య ఉదయం 8 గంటలకు అదుపులోకి..
విజయవాడ తూర్పు ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కు తరలింపు
అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు
ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ బైఠాయింపు
కూటమి ప్రభుత్వ విధానాలు నశించాలి.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
జోగి రమేష్ సోదరుడు జోగి రాము, వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రాము కూడా అరెస్టు
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అక్రమ అరెస్ట్ అని సర్వత్రా చర్చ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.
జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను పోలీస్ వ్యాన్‌లో బలవంతంగా ఎక్కించి, విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జోగి రమేష్ సోదరుడు రాము, జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
రమేష్ ను అరెస్ట్ చేయొద్దని ఆందోళన
జోగి రమేష్ ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తుండటాన్ని నిరసిస్తూ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్.. నారా వారి సారా రాజ్యం నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర∙వాగ్వాదం జరిగింది.
ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన
జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలియడంతో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఆయన అక్రమ ఆరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, ఉప్పాల రాము, తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు నాగార్జున, తిరుపతిరావు, రవిచంద్ర, అవుతు శ్రీనివాసరెడ్డి, పోతిన మహేష్ , జెడ్పీ వైస్ చైర్మన్ జి.శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జి.శ్రీనివాస్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, రాత్రి జోగి రమేష్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం వద్దే ఉన్నారు.
చంద్రబాబు పిచ్చకి పరాకాష్ట – జోగి రమేష్ , మాజీ మంత్రి
చంద్రబాబునాయుడు నా మీద కక్ష కట్టాడని 20 రోజులుగా చెబుతున్నాను. అందులో భాగమే ఈ అక్రమ అరెస్టు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య, బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను.. కనకదుర్గమ్మ వారి దగ్గరకు తీసుకువెళ్లాను.. ప్రమాణం చేసి చెప్పాను. అయినా చంద్రబాబునాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు దుర్మార్గానికి, పిచ్చికి ఇది పరాకాష్ట. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతి చెందిన సంఘటనను డైవర్షన్ చేసేందుకు కుట్ర పన్నారు. నన్ను అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబునాయుడు, లోకేశ్.. ఖబడ్దార్.. మీకు భార్య, పిల్లలు ఉన్నారు. మీకు కుటుంబం ఉంది. నన్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు.

జోగి సోదరుల ఇళ్లల్లో క్లూస్ టీమ్ తనిఖీ
జోగి రమేష్ , జోగి రాముల అరెస్ట్ అనంతరం వారి నివాసాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీమ్ బృందాల్లోని సభ్యులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సీసీ టీవీ పుటేజీలు, హార్డ్ డిస్‌్కలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు పరిశీలించారు. పలు ఎల్రక్టానిక్స్ వస్తువులను రెండు బాక్సుల్లో ప్యాక్ చేసి వారితోపాటు తీసుకెళ్లారు.
బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకే అక్రమ అరెస్టు
జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘బీసీ సామాజికవర్గానికి చెందిన వాళ్లం కాబట్టి మా రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక చంద్రబాబునాయుడు, లోకేశ్ మాపై కక్షగట్టారు. ఒక బీసీ నాయకుడు నా ఇంటి దగ్గరకు రావడమేంటని కక్ష పెంచుకొని నా భర్త జోగి రమేష్‌ను అణిచివేయాలని చూస్తున్నారు’ అని ఆయన సతీమణి జోగి శకుంతలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు అనంతరం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో తన కొడుకు జోగి రాజీవ్‌ను, ఇప్పుడు తన భర్త జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పించేందుకే తన భర్త.. చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్లారన్నారు. ఆ సమయంలో టీడీపీ నాయకులే తన భర్త కారుపై దాడి చేశారని గుర్తు చేశారు. కానీ ఆ సంఘటనను చంద్రబాబు ఇంటి మీద దాడిగా చిత్రీకరించారని ఆమె వాపోయారు. అది మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు పరిపాలన గాలికొదిలేసి తమ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు నాయుడుకు మనస్సాక్షి అనేది ఉంటే కొంచెం అయినా ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే తన భర్తను అణిచివేసేందుకు పూనుకున్నారని ఆమె మండిపడ్డారు.
హక్కులను కాలరాస్తూ...
రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులు తమ ఇంటి వద్ద ప్రవర్తించిన తీరు భయాందోళన కలిగించిందని జోగి శకుంతలమ్మ చెప్పారు. నిద్రపోతున్న సమయంలో ఇంటి మీదకు వచ్చి.. డోర్లు కొట్టి.. భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆందోళన వ్యక్తంచేశారు. డోర్లు తెరవకపోతే పగలకొడతాం అని వాచ్‌మెన్‌ను బెదిరించారన్నారు. తాను నిర్దోషి అని తన భర్త కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కుటుంబ సభ్యులందరి సమక్షంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు.
తన భర్త మీద ఎవరైతే నకిలీ మద్యం కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారో వారంతా ఆయన తప్పు చేశాడని ప్రమాణం చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని ఆమె సవాల్ విసిరారు. తప్పు చేసి ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటామన్నారు. కానీ, ఏ తప్పు చేయకుండా తమ కుటుంబ సభ్యులను ఈ రకంగా హింస పెట్టడాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, తన భర్త జోగి రమేష్ , మరిది జోగి రాము కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తంచేశారు.


