జేఈఈ మెయిన్‌ సిలబస్‌ ఖరారు

JEE Main Syllabus is finalised - Sakshi

మ్యాథమెటిక్స్‌లో 16 టాపిక్‌లు

ఫిజిక్స్‌ సెక్షన్‌–ఏలో 20 టాపిక్స్, సెక్షన్‌–బిలో ప్రయోగ నైపుణ్యాలు

ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీల్లో 10 చొప్పున టాపిక్స్‌

జనవరి పరీక్షల షెడ్యూల్‌ సమయంలో పలు బోర్డుల ప్రాక్టికల్‌ పరీక్షలు

ఒకే తేదీల్లో రెండింటి పరీక్షలు ఉండడంతో విద్యార్థుల ఆందోళన

జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పరీక్షలు వాయిదా వేయాలని విన్నపం

సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2023 సిలబస్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. మ్యాథమెటిక్స్‌లో 16 టాపిక్‌లు, ఫిజిక్స్‌ సెక్షన్‌–ఏలో 20 టాపిక్స్, సెక్షన్‌–బిలో ప్రయోగ నైపుణ్యాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక కెమిస్ట్రీలోని ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీల్లో 10 చొప్పున టాపిక్స్‌ ఉన్నాయి.

తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర మాధ్యమాల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏ భాషలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ముందుగానే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో భాగంగా బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు పేపర్‌–1, బీఆర్క్‌ కోసం పేపర్‌–2ఏ, బీప్లానింగ్‌కు పేపర్‌–2బీని నిర్వహిస్తారు. పేపర్‌–1లో మూడు సెక్షన్ల కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రశ్నలుంటాయి.

కంప్యూటర్‌ ఆధారితంగా పరీక్షలు జరుగుతాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటాయి. అలాగే నెగిటివ్‌ ఆన్సర్‌కు 1 మార్కు కోత ఉంటుంది.  పేపర్‌–1లో మూడు సెక్షన్లలో 300 మార్కులకు 90 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలుంటాయి. పేపర్‌–2ఏలో 400 మార్కులకు 82 ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–2బీలో 400 మార్కులకు 105 ప్రశ్నలుంటాయి. 

జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా పరీక్షలు..
కాగా జేఈఈ మెయిన్‌ పరీక్షలను జనవరి, ఏప్రిల్‌లలో రెండు సెషన్లుగా నిర్వహించేలా ఎన్‌టీఏ షెడ్యూల్‌ విడుదల చేసింది. తొలి సెషన్‌ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్‌ ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఇప్పటికే తొలి సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే జనవరి సెషన్‌ పరీక్షల తేదీల్లోనే పలు ఇంటర్మీడియెట్‌ బోర్డులు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నాయి.

ఒకే తేదీల్లో ఈ రెండు పరీక్షలు రావడం వల్ల తమకు నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా జనవరి సెషన్‌కు సన్నద్ధం కావడానికి తక్కువ సమయం ఇచ్చారని, ఈ తేదీలను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో రద్దు చేసిన ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను పునరుద్ధరించడం వల్ల కూడా ఎక్కువ మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను కూడా సడలించాలని కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top