AP: నదుల అనుసంధానానికి ‘నిరా’ | Jal Shakti Proposal To NIRA Over River Links | Sakshi
Sakshi News home page

AP: నదుల అనుసంధానానికి ‘నిరా’

Aug 23 2021 1:43 PM | Updated on Aug 23 2021 3:47 PM

Jal Shakti Proposal To NIRA Over River Links - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానం పనులు చేపట్టడానికి నేషనల్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఆఫ్‌ రివర్స్‌ అథారిటీ(ఎన్‌ఐఆర్‌ఏ – నిరా) పేరుతో ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. కడలిపాలవుతోన్న నదీ జలాలను మళ్లించి.. దేశాన్ని సుభిక్షం చేసేందుకు నదుల అనుసంధానం చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

దీంతో నదుల అనుసంధానంపై అధ్యయనం చేసిన ఎన్‌డబ్ల్యూడీఏ హిమాలయ నదులను అనుసంధానం చేసేందుకు 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు నదుల అనుసంధానం చేపట్టాలని 2012 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 సెప్టెంబరు 23న కేంద్ర జల్‌ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

90ః10 నిష్పత్తిలో నిధులు
నదుల అనుసంధానంపై అధ్యయనం, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయడానికి, రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడానికి ఎక్కువ సమయం పడుతుందని ఎన్‌డబ్ల్యూడీఏ కేంద్రానికి తెలిపింది. ఈ సమస్యను అధిగమించడానికి ‘నిరా’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే నదుల అనుసంధానం పనులు చేపట్టడానికి 90 శాతం నిధులను కేంద్రం సమకూర్చాలని పేర్కొంది.

మిగతా 10 శాతం నిధులను ప్రయోజనం పొందే రాష్ట్రాలు ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని సూచించింది. కేంద్రం, రాష్ట్రాలు నిధులను ‘నిరా’కు అందజేస్తే.. పనులు చేపడుతుందని పేర్కొంది. కెన్‌–బెట్వా నదుల అనుసంధానం నుంచే ‘నిరా’కు బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేస్తే నదుల అనుసంధానం పనులకు మార్గం సుగమమవుతుంది.

ఏకాభిప్రాయానికి కసరత్తు
ఏకాభిప్రాయంతో నదుల అనుసంధానాన్ని చేపట్టడానికి ప్రత్యేక కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతూ ఏకాభిప్రాయం సాధించడానికి చర్యలు చేపట్టింది. కెన్‌–బెట్వా నదుల అనుసంధానానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు అంగీకరించాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో కెన్‌–బెట్వా నదుల అనుసంధానం ఒప్పందంపై ఆ రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్‌ చౌహన్‌లు గతేడాది మార్చి 22న సంతకం చేశారు.

2017–18 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.35,111.24 కోట్ల వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదుల అనుసంధానం కోసం ఈ నాలుగు నదుల పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ పనులకు 2018–19 ధరల ప్రకారం రూ.60,361 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఇదే రీతిలో మిగిలిన నదుల అనుసంధానానికి ప్రత్యేక కమిటీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement