పద్దు రద్దు.. జీఎస్టీకి చెల్లు! | Sakshi
Sakshi News home page

పద్దు రద్దు.. జీఎస్టీకి చెల్లు!

Published Mon, Aug 9 2021 3:23 AM

Irregulars not paying GST In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: జీఎస్టీ విధానాన్ని సరళతరం చేస్తూ తీసుకొచ్చిన నిబంధనలను రాష్ట్రంలో కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఎంచక్కా వ్యాపారం చేస్తూ.. వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధిస్తున్నా, ఎక్కడా కాగితాల్లో చూపించకుండా దర్జాగా వందల కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొడుతున్నారు. ఇలా 2017 నుంచి రాష్ట్రంలో యథేచ్ఛగా 1.64 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్ల రద్దుతో కేంద్ర, రాష్ట్ర ఖజానాలకు భారీగా గండి కొట్టారు. సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త తనిఖీల్లో ఈ అవినీతి బాగోతం బట్టబయలైంది. 

ఇదీ వారి దారి.. 
► రాష్ట్రంలో ఓ వ్యాపార సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకుని వ్యాపారం మొదలు పెట్టింది. ప్రతి నెల జీఎస్టీ రిటర్ను దాఖలు చేయాలి. వరుసగా ఆరు నెలల పాటు రిటర్నులు దాఖలు చేయకపోవడంతో నిబంధనల ప్రకారం అధికారులు రిజిస్ట్రేషన్‌ రద్దు చేశారు. కానీ ఆ వ్యాపార సంస్థ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఈ ఆరు నెలల్లో చేసిన వ్యాపార టర్నోవర్‌ గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దానిపై పన్ను చెల్లించరు. అంతటితో వ్యాపారం నిలిపివేస్తారా అంటే అదీ లేదు.  
► దేశంలో ఒక రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతంలోని వ్యాపార సంస్థ మరే రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి అయినా సరే జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన మూడు రోజుల్లో అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయకపోతే.. ఆటోమేటిగ్గా రిజిస్ట్రేషన్‌ అయిపోతుంది. (డీమ్డ్‌ టుబీ రిజిస్టర్డ్‌). కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ రద్దు అయిన వ్యాపార సంస్థ ఈసారి మరో రాష్ట్రం నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యాపారం సాగిస్తుంది.  
► ఆ రాష్ట్రంలో కూడా ఆరు నెలలపాటు రిటర్నులు దాఖలు చేయరు. దాంతో రిజిస్ట్రేషన్‌ రద్దు అయితే చేస్తారు. కానీ ఈ కాలంలో జరిగిన టర్నోవర్‌కు ఎక్కడా లెక్క ఉండదు. పన్నులు ఉండవు. ఈసారి మరో రాష్ట్రం నుంచి నమోదు.. ఈ దందా నిరంతర ప్రక్రియగా సాగుతోంది. ఈ వ్యవహారంపై సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం స్పెషల్‌ కమిషనర్‌ ఎస్‌.నారాయణ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్‌ పియూష్‌ కుమార్‌లు దృష్టి సారించి ప్రత్యేక విచారణ చేపట్టారు.   

జీఎస్టీ ఎగవేత కట్టడికి పటిష్ట చర్యలు 
► 2017 నుంచి రాష్ట్రంలో సాగుతున్న జీఎస్టీ ఎగవేత దందాకు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయడానికి సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కార్యాచరణకు ఉపక్రమించాయి.  
► జీఎస్టీ అంశాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించేందుకు వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ ప్రత్యేకంగా ఆడిట్‌ విభాగాన్ని నెలకొల్పారు. మూడు స్థాయిల్లో అధికారులు పర్యవేక్షిస్తూ.. విస్తృత తనిఖీల కోసం వంద బృందాలను నియమించారు.  
► ప్రత్యేకంగా డాటా అనలిటిక్స్‌ వింగ్‌ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం భారీ పన్ను ఎగవేసే అవకాశం ఉన్న సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. జీఎస్టీ ఎగవేతలను కట్టడి చేసే అంశంపై చర్చించేందుకు జాయింట్‌ కమిషనర్లతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు.  

విచారణ సాగుతోందిలా..
► ప్రత్యేక అధికారుల బృందాలను నియమించి వాటిలో ర్యాండమ్‌గా 3,570 రద్దు పద్దులను పరిశీలించారు. సరుకు రవాణాకు సంబంధించి వే బిల్లులు, సరుకు అమ్మినట్టు చెప్పే జీఎస్టీర్‌ 1 రిటర్నులు, ప్రతి నెల దాఖలు చేయాల్సిన జీఎస్టీర్‌ 3బి రిటర్నులు పరిశీలిస్తే వాటి మధ్య భారీ వ్యత్యాసం ఉందని స్పష్టమైంది. 
► సరుకు వెళ్లినట్టు వే బిల్లుల్లో ఉంటుంది. కానీ ఆ సరుకు అమ్మినట్టుగానీ, అందుకు సంబంధించి నెలవారీ రిటర్ను దాఖలు చేసినట్టుగానీ లేదని వెల్లడైంది. ఆ విధంగా గుట్టుచప్పుడు కాకుండా టర్నోవర్‌ను దాచిపెట్టి, జీఎస్టీని ఎగ్గొట్టారు. 
► ప్రాథమిక పరిశీలనలో.. రద్దు అయిన 3,570 రిజిస్ట్రేషన్లలో సెంట్రల్‌ జీఎస్టీకి చెందినవి 1,513 ఉండగా, రాష్ట్ర జీఎస్టీకి చెందినవి 2,057 ఉన్నాయి. ఇందువల్ల ఏకంగా రూ.4,400.83 కోట్ల టర్నోవర్‌ను అధికారికంగా చూపించలేదు. ఇందులో కేంద్ర జీఎస్టీ వాటా రూ.1,491.84 కోట్లు  కాగా, రాష్ట్ర జీఎస్టీ వాటా రూ.2,908.97 కోట్లు. 
► వివిధ కేటగిరీల కింద 5 శాతం నుంచి 18 శాతం వరకు జీఎస్టీ చెల్లించాలి. ఈ లెక్కన వందల కోట్ల రూపాయల జీఎస్టీని ఎగవేశారు. మొత్తం మీద రద్దు అయిన 1.64 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే.. ఎన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌ను లెక్కల్లో చూపించ లేదో.. తద్వారా ఎన్ని వేల కోట్ల జీఎస్టీని ఎగవేశారో అంతుచిక్కడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర జీఎస్టీకి సంబంధించిన అంశాలపై అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement