ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

Interstate Bus Service Standoff APSRTC Alternative Arrangements - Sakshi

సాక్షి, విజయవాడ: దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్‌ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాలుగో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. అయితే పండుగ సందర్భంగా ప్రయాణికులు సౌలభ్యం కోసం రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సులు నడిపేందుకు ఏసీఎస్‌ ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేశారు. 

ఈ సందర్భంగా ఆర్టీసీ (విజయవాడ జోన్) ఈడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దసరా సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌కు బస్సులు నడపలేకపోతున్నామని, అయితే సరిహద్దుల దాక నడుపుతామని వెల్లడించారు. విజయవాడ నుంచి గరికపాడు వరకూ, గుంటూరు జిల్లాలో చెక్‌పోస్ట్‌ వరకూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఏపీఎస్‌ ఆర్టీసీకి నష్టం వస్తున్నా..
తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపించామని, రూట్ల వారీగా కూడా స్పష్టత ఇచ్చామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నిన్న మీడియాకు తెలిపారు. ఏపీఎస్‌ ఆర్టీసీ 1.04 లక్షల కి.మీ. తగ్గించుకుందని, 1.61 లక్షల కి.మీకే పరిమితం అయ్యామని చెప్పారు. ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్‌ ఆర్టీసీకి నష్టం వస్తున్నా కేవలం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు నడపాలనే ఉద్దేశంతో టీఎస్‌ ఆర్టీసీ డిమాండ్లకు అంగీకరించామని వివరించారు. ఈ నెల 19నే తుది ప్రతిపాదనలు పంపించామని, వాళ్లు కోరినట్లు ప్రతిపాదనలు పంపినా ఇంకా గందరగోళం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. 

రోజుకు 3.5 కోట్ల రూపాయల నష్టం
ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. విజయవాడ - హైదరాబాద్‌ రూట్లో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు తగ్గించాలని తెలంగాణ అధికారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు 322 బస్సులను తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపించాం. ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరేలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు 70 వేల కి.మీ. చొప్పున బస్సులు నడుపుదామని ప్రతిపాదించినా వారు అంగీకరించలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజుకు రూ. 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top