
మంగళగిరి టీడీపీ ఆఫీస్ వద్ద నిరసన తెలుపుతున్న పారిశ్రామికవేత్తలు
పారిశ్రామిక రాయితీలు రూ.1,200 కోట్లు విడుదల చేయాలంటూ ఆందోళన
మంగళగిరి టీడీపీ, ఏపీఐఐసీ కార్యాలయాల ఎదుట ధర్నా
రాయితీలు ఇవ్వకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పారిశ్రామికవేత్తలు రోడ్డెక్కారు. తమకు రావాల్సిన రాయితీలిచ్చి ఆదుకోవాలంటూ అంటూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళగిరి టీడీపీ, ఏపీఐఐసీ కార్యాలయాల ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు.
కనీసం వీరితో మాట్లాడటానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఏపీఐఐసీ వీసీఎండీ అభిషేక్త్‌కిషోర్ రాలేదు. కనీసం దళిత పారిశ్రామికవేత్తలను కార్యాలయం పైకి కూడా ఆహ్వనించలేదు. అడిషనల్ డైరెక్టర్ రామలింగేశ్వరరాజు, జాయింట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు (ఇన్సెంటివ్స్)లను పంపి వినతిపత్రం తీసుకుని సెప్టెంబర్‌లో రాయితీలను విడుదల చేస్తామని హామీ ఇప్పించి పంపించేశారు.
అనంతరం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేసి గ్రీవెన్స్ సెల్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్న పార్టీ ప్రతినిధులకు వినతిపత్రం అందచేశారు. అనంతరం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న కష్టాలను మీడియాకు వివరించారు.
తక్షణమే రాయితీలు విడుదల చేయాలి
కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకసార్లు వివిధ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ వ్యాపార సంఘాల ప్రతిని«దులు అధికారులకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని ఏపీ దళిత ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పినమాల నాగకుమార్ మీడియా సమావేశంలో విమర్శించారు. ఏడాది కాలంగా ప్రతినెలా 15వ తేదీన రాయితీ సొమ్ము విడుదల చేస్తాం అని చెబుతున్నారే తప్ప ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవంతో పరిశ్రమలు నడపడం చాలా కష్టంగా మారిందన్నారు.
మొత్తం పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద రూ.15 వేల కోట్ల వరకు రాయితీ బకాయిలు ఉన్నాయని, ఇందులో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సుమారు రూ.1,200 కోట్ల వరకు రాయితీలు ఇవ్వాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వాలు అడ్వాన్స్ సబ్సిడీలు విడుదల చేసి కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాయనిచెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి బకాయిలను వెంటనే చెల్లించి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
అప్పు పుడితేనే ప్రోత్సాహకాలు
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం అప్పుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే ఎస్‌బీఐ నుంచి రూ.5 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పలుమార్లు ప్రయతి్నంచి విఫలమయ్యింది. ఇప్పుడు తాజాగా ఏపీఐఐసీకి చెందిన భూములన్నీ ఒక ప్రత్యేక కంపెనీ కిందకు బదలాయించి ఆ భూములను తనఖా పెట్టి రూ.7 వేల కోట్లు రుణం తీసుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం ఈ మధ్యనే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
నవంబర్‌లో విశాఖలో నిర్వహించనున్న సీఐఐ పెట్టుబడుల సమావేశానికి ముందైనా.. కనీసం రూ.3 వేల కోట్ల చెల్లించి పారిశ్రామిక బకాయిలు చెల్లించేశామని ప్రచారం చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.