Increased Attention To Public On Heart Health - Sakshi
Sakshi News home page

గుండె ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ 

Published Wed, Jun 22 2022 5:22 AM

Increased attention to public on heart health - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో మరణిస్తున్న వారిసంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో ఏటా మూడు మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ తీసుకునే ప్రముఖ వ్యక్తులు కొందరు ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దీనికితోడు కోవిడ్‌ మహమ్మారి దాడి అనంతరం కొందరిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

ఈ కారణాలన్నీ వెరసి గుండె ఆరోగ్య రక్షణపై ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. ఇందుకు నిదర్శనం గడిచిన ఏడాది కాలంలో కార్డియాలజీకి సంబంధించి పురుషుల ఆన్‌లైన్‌ సంప్రదింపులు 300 శాతం, ఆస్పత్రిలో నేరుగా సంప్రదింపులు 150 శాతం పెరిగాయి. ఈ అంశాన్ని ఇటీవల ఇండియన్‌  హార్ట్‌ అసోసియేషన్‌ (ఐహెచ్‌ఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఆస్పత్రుల్లో నేరుగా, ఆన్‌లైన్‌లో సంప్రదిస్తున్న వారిలో 60 శాతం మంది 21–40 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నట్టు పేర్కొంది. 

50 శాతం మంది 50 ఏళ్లు లోపు వారే
దేశంలో గుండెపోటుకు గురవుతున్న పురుషుల్లో 50 శాతం మంది 50 ఏళ్ల లోపు వారే. 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారు ఉంటున్నట్టు ఐహెచ్‌ఏ తెలిపింది. ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదిస్తున్న వారిలో 40 శాతం మంది నగరాలు, పట్టణాలకు చెందిన వారు కాగా 60 శాతం మంది మెట్రో నగరాలకు చెందినవారు. 

కరోనా ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
వైద్యులను సంప్రదిస్తున్న వారిలో ఎక్కువ మంది హృద్రోగుల్లో కరోనా ప్రభావం ఎంత.. ఏ విధంగా ఉంటుంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అదేవిధంగా గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి.. కార్డియాక్‌ అరెస్ట్, కరోనరీ ఆర్డరీ డిసీజ్‌.. ఇతర గుండె సమస్యలు ఏమిటి.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలా గుర్తించాలి? అనే అంశాల గురించి తెలుసుకుంటున్నారు. 

అవగాహన పెరగడం మంచిదే
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గడిచిన రెండేళ్లలో ప్రజల జీవన విధానాలు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు కొందరిని వెంటాడుతున్నాయి. రక్తం చిక్కబడి గడ్డలు కట్టడం సంభవిస్తోంది. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలకు తోడు ప్రముఖులు గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ప్రజల్లో గుండె సమస్యల పట్ల అవగాహన పెరుగుతోంది. మాకు గుండె సంబంధిత ఓపీలు పెరిగాయి.

సంప్రదిస్తున్న వారిలో మెజారిటీ యువకులే ఉంటున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడం మంచిదే. అయితే ఏదైనా సమస్య ఉందని తెలిసి ఆందోళన చెందడం మంచిది కాదు. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గింది. ఈ క్రమంలో పూర్వపు జీవన విధానాలు ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. యోగ, వ్యాయామం చేయాలి. 
– డాక్టర్‌ విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్‌ విజయవాడ

నేరుగా సంప్రదింపులే ఉత్తమం
గుండె సంబంధిత సమస్యలకు ఆన్‌లైన్‌లో కంటే నేరుగా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్‌ వంటి పరీక్షలు చేస్తేనే గుండె సమస్యలను గుర్తించవచ్చు. గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం జీవనశైలి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు జీవనశైలి మార్చుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలను వీడాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆధునిక జీవన విధానాలతో చిన్న వయసులోనే బీపీ, షుగర్‌ చుట్టుముడుతున్నాయి. 20 ఏళ్ల వయసు వారు గుండెపోటుకు గురవుతున్నారు.
– డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, కర్నూలు 

Advertisement
Advertisement