మహిళలు తీసుకునే రుణాల్లో భారీ పెరుగుదల | Huge increase in loans taken by women | Sakshi
Sakshi News home page

మహిళలు తీసుకునే రుణాల్లో భారీ పెరుగుదల

Apr 17 2026 5:25 AM | Updated on Apr 17 2026 5:25 AM

Huge increase in loans taken by women

2017లో దేశవ్యాప్తంగా రూ.16 లక్షల కోట్లు రుణాలు 

2025 నాటికి 4.8 రెట్లు పెరిగి రూ.76 లక్షల కోట్లకు పెరుగుదల

మహిళల వ్యాపార రుణాల్లో అత్యధిక వృద్ది నమోదు 

2017లో 16 శాతం.. 2025 నాటికి 25 శాతం  

నీతిఆయోగ్‌ నివేదిక వెల్లడి  

సాక్షి, అమరావతి: దేశంలో మహిళలు తీసుకునే రుణాలు భారీగా పెరిగాయి. ఇందులో వ్యాపార రుణాల్లో అత్యధిక వృద్ది నమోదైంది. దేశంలో మహిళలు–అభివృద్ధి చెందుతున్న రుణ మార్కెట్‌పై నీతిఆయోగ్‌ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2017లో మహిళలు తీసుకున్న రుణాలు రూ.16 లక్షల కోట్లు ఉండగా 2025 నాటికి 4.8 రెట్లు పెరిగి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. వ్యాపార రుణాల విషయంలో మహిళా పారిశ్రామికవేత్తలు బలమైన వృద్ధి సమూహంగా ఆవిర్భవించారు. 

2017 నుంచి వారి పోర్ట్‌ఫోలియో నిల్వలు 7.5 రెట్లు పెరిగాయి. క్యాష్‌ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్‌ వంటి రివాల్వింగ్‌ క్రెడిట్‌ ఉత్పత్తుల వైపు క్రమంగా మళ్లడం.. పెరుగుతున్న ఆర్థిక పరిజ్ఞానాన్ని, వ్యాపార పరిపక్వతను సూచిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో మహిళలు తీసుకునే రుణ మార్కెట్‌ సగటు వార్షిక వృద్ధి రేటు 20 శాతంగా ఉంది. ఏటా స్థిరమైన వృద్ధిని సూచిస్తోంది. రిటైల్‌ రుణాల విభాగం ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వ్యాపార రుణాల్లో ఎక్కువ వృద్ధి నమోదైంది.

మహిళలు తీసుకునే రుణాల్లో వ్యాపార రుణాల వాటా 2017 నుంచి 2025 మధ్య 16 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది. దేశంలో మహిళలకు రుణ లభ్యత 2017లో 19 శాతం ఉండగా 2025 నాటికి 36 శాతానికి పెరిగింది. ఈ వృద్ధి మహిళల ఆర్థిక ప్రవర్తనలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పును ప్రతిబింబిస్తోంది. దీని ప్రకారం ఎక్కువమంది మహిళలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి రుణాలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement