
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ‘స్థానికత’పై హైకోర్టు స్పష్టత
పలువురు విద్యార్థుల పిటిషన్లు కొట్టివేత
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ‘స్థానికత’ విషయంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టత నిచ్చింది. ఈ తీర్పు ప్రతి గురువారం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వెలుపల విద్యను అభ్యసించినప్పటికీ, తాము రాష్ట్రంలో నివాసం ఉంటున్నామని, అందువల్ల తమను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలంటూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపల క్వాలిఫయింగ్ ఎగ్జామ్ (ఇంటర్) చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపింది. అలాగే గతంలోనే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దీనిపై చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ఇందులో తాము కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదంది. తాము కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు, హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ధర్మాసనం తాజా తీర్పు ప్రకారం ఎవరు స్థానిక అభ్యర్థులు అవుతారంటే..
⇒ ప్రవేశం కోరుతున్న విద్యారి్థ, తాను ఏ లోకల్ ఏరియా (ఎస్‌వీ యూనివర్సిటీ లేదా ఏయూ పరిధి)లో చదివానని చెబుతున్నాడో, ఆ ప్రాంతంలో ఆ అభ్యర్థి వరుసగా నాలుగేళ్చ్లు చదివి ఉండాలి. ఆ నాలుగేళ్లను క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్(+2)తో ముగించి ఉండాలి. అప్పుడే ఆ అభ్యర్థి ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థి అవుతాడు.
⇒ ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో (లోకల్) ఏ విద్యా సంస్థలోనూ చదవకపోయినప్పటికీ, క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థే అవుతాడు.
⇒ అలాగే క్వాలిఫయింగ్ పరీక్ష రాసే నాటికి ఆ అభ్యర్థి లోకల్ ఏరియాలో నాలుగేళ్ల పాటు ఎక్కడా కూడా విద్యాభ్యాసం చేయనప్పటికీ, రాష్ట్రంలో ఏడేళ్ల పాటు నివాసం ఉంటే సైతం ఆ అభ్యర్థిని స్థానిక అభ్యర్థిగానే పరిగణించాల్సి ఉంటుంది.