జనసేనలో చురుగ్గా వ్యవహరిస్తున్న గెస్ట్ లెక్చరర్
నర్సీపట్నంలో ఘటన
నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థినిపై గెస్ట్ లెక్చరర్ వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఈ కళాశాలలో రెండేళ్లుగా మండల కేంద్రమైన గొలుగొండకు చెందిన కోనా నారాయణరావు గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తూ జనసేన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. పార్టీ పదవి కోసం ఈయన పేరును ఇటీవల స్థానిక నాయకత్వం సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. అయితే, ఇటీవలే డిగ్రీ ఫస్టియర్‌లో చేరిన ఓ విద్యార్థినిని నారాయణరావు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. నిజానికి.. వివాహితుడైన నారాయణరావుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
తాను గతంలో ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని, ఆమె అచ్చు నీలాగే ఉంటుందని అతను ఆ విద్యార్థినికి చెప్పుకొచ్చాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను చదివించి అన్ని విధాలా చూసుకుంటానంటూ లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థిని ఈ విషయాన్ని సహచర విద్యార్థులకు చెప్పింది. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకుల వరకు వెళ్లడంతో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగి కళాశాల ముందు బైఠాయించారు. ఆ అధ్యాపకుడిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతవరకు తరగతులకు హాజరుకాబోమని భీష్మించారు.
భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని ప్రిన్సిపాల్ ఎస్.రాజు, ఇతర అధ్యాపకులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తప్పును సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థినులను కోరారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దీంతో చేసేదిలేక ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నారాయణరావుతో రాజీనామా చేయించారు. నారాయణరావు గతంలో యలమంచిలి, అరకులలో కూడా పనిచేశాడు. అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు తెలిసింది.


