breaking news
guest lecturer
-
ప్రేమ పేరుతో విద్యార్థినిపై అధ్యాపకుడి వేధింపులు
నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థినిపై గెస్ట్ లెక్చరర్ వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఈ కళాశాలలో రెండేళ్లుగా మండల కేంద్రమైన గొలుగొండకు చెందిన కోనా నారాయణరావు గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తూ జనసేన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. పార్టీ పదవి కోసం ఈయన పేరును ఇటీవల స్థానిక నాయకత్వం సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. అయితే, ఇటీవలే డిగ్రీ ఫస్టియర్‌లో చేరిన ఓ విద్యార్థినిని నారాయణరావు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. నిజానికి.. వివాహితుడైన నారాయణరావుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.తాను గతంలో ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని, ఆమె అచ్చు నీలాగే ఉంటుందని అతను ఆ విద్యార్థినికి చెప్పుకొచ్చాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను చదివించి అన్ని విధాలా చూసుకుంటానంటూ లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థిని ఈ విషయాన్ని సహచర విద్యార్థులకు చెప్పింది. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకుల వరకు వెళ్లడంతో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగి కళాశాల ముందు బైఠాయించారు. ఆ అధ్యాపకుడిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతవరకు తరగతులకు హాజరుకాబోమని భీష్మించారు.భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని ప్రిన్సిపాల్ ఎస్.రాజు, ఇతర అధ్యాపకులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తప్పును సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థినులను కోరారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దీంతో చేసేదిలేక ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నారాయణరావుతో రాజీనామా చేయించారు. నారాయణరావు గతంలో యలమంచిలి, అరకులలో కూడా పనిచేశాడు. అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు తెలిసింది. -
Ch Nageshu Patro: ఈయనో మూన్‌లైటింగ్ కూలీ
బరంపూర్: మూన్‌లైటింగ్. ఐటీ రంగంలో ఈ మధ్య బాగా పాపులరైన పదం. రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. ఒడిశాకి చెందిన ఒక లెక్చరర్ కూడా మూన్‌లైటింగ్ చేస్తున్నారు. కానీ ఈయనది మనసుని కదిలించే కథ. పొద్దున్న పూట కాలేజీలో విద్యార్థులకు పాఠాలు. రాత్రయ్యే సరికి ఎర్రచొక్కా వేసుకొని రైల్వే స్టేషన్లలో కూలీ అవతారం. డబ్బు సంపాదించడం కోసం కాకుండా, తాను ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో పని చేసే వారికి జీతాలు ఇవ్వడం కోసం కూలీ పని చేస్తున్నారు. ఒడిశాలో గంజామ్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల సీహెచ్.నగేశు పాత్రో బరంపూర్ రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసేవారు. కరోనా సమయంలో రైళ్లు నిలిచిపోవడంతో ఆయనకు పని లేకుండా పోయింది. ఎంఏ వరకు చదువుకున్న పాత్రో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నిరుపేద విద్యార్థుల కోసం ఒక కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పదో క్లాసు పిల్లలకి పాఠాలు చెప్పసాగారు. కోచింగ్ సెంటర్‌కి ఆదరణ పెరగడంతో 10 నుంచి 12 వేల జీతానికి కొందరు టీచర్లను నియమించారు. వారికి జీత భత్యాలు ఇవ్వడానికి రాత్రయ్యే సరికి మళ్లీ కూలీ పని చేస్తున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు పాత్రో సూరత్‌లోని ఒక మిల్లులో, హైదరాబాద్‌లోని ఒక మాల్లో పని చేసి తాను సంపాదించిన డబ్బులతోనే చదువుకున్నారు. -
జీతం అందక దినసరి కూలీగా మారిన గెస్ట్ లెక్చరర్
నల్లగొండ: విద్యార్థుల మెదళ్లలో జ్ఞానబీజాలు నాటాల్సిన ఆయన, పొలాల్లో నాట్లేసేవారికి నారు అందిస్తున్నాడు... పాఠాలు చెప్పాల్సిన ఆయన పత్తిచేనులో పత్తి ఏరుతున్నాడు... కంపచెట్లు కొట్టి కడుపు నింపుకుంటున్నాడు. ఇదీ ఓ గెస్ట్ లెక్చరర్ దుస్థితి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కోల్ముంతల పహాడ్‌కు చెందిన బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు దేవరకొండ బాలికల జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుడు. ఆయనకు భార్య, కుమారుడు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. భూములు, ఆస్తులు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో 16 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు వ్యవసాయకూలీగా మారాడు. జిల్లాలో ఉన్న మొత్తం 150 మంది అతిథి అధ్యాపకులు కూడా ఆయనలాగే వేతనమందక యాతన అనుభవిస్తున్నారు. -
వేతన వెతలు
బద్వేలు : ఆదర్శ పాఠశాలల్లో పని చేసే గెస్ట్ ఉపాధ్యాయులు వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలు ప్రారంభమై నాలుగో నెల వచ్చినా ఇప్పటి వరకు జీతాల గురించి పట్టించుకునే నాథుడే లేరు. ఉత్తమ ఫలితాల కోసం కృషి చేసినా, తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని ఆదర్శ పాఠశాలల్లో ఇదే పరిస్థితి. కాంట్రాక్టు ఉపాధ్యాయులుగానియమించాలని కోరుతున్నా.. ఆదర్శ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పలు ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠ్యాంశాల బోధనలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గెస్ట్ ఉపాధ్యాయులు(టీజీటీ), అధ్యాపకులు(పీజీటీ)ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది గెస్ట్ బోధకులుగా పని చేస్తుండగా.. జిల్లాలోని పది ఆదర్శ పాఠశాలల్లో 46 మంది వివిధ సబ్జెక్టులు బోధిస్తున్నారు. వీరు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లోని పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు కార్పొరేట్ సంస్థల స్థాయిలో ఫలితాలు సాధించడంలో వీరి కృషి కూడా ఉంది. వీరికి ప్రస్తుతం ఉపాధ్యాయులకు రూ.12 వేలు, అధ్యాపకులకు రూ.13 వేల వంతున వేతనాలు ఇస్తున్నారు. దీంతోపాటు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో గెస్ట్ బోధకులుగా నియమించినా.. ఇప్పటి వరకు వేతనాలు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోతున్నారు. పిల్లల చదువులు, ఇతర ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు తమకు జీతాలు పెంచాలని, కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు. జీతాలు పెంచాలి మాకు అతి తక్కువ మొత్తంలో జీతాలు ఇస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.20 వేల పైనే జీతాలు ఇస్తున్నారు. వారితో సమానంగా వి«ధులు నిర్వహిస్తున్నా జీతాలు మాత్రం పెంచడం లేదు. దీంతోపాటు నెలనెలా ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.– దిలీప్‌కుమార్, పీజీటీ, నరసాపురం, కాశినాయన మండలం -
గెస్టు లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం
మైలవరం : మైలవరం వీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, కామర్స్ (వృత్తి విద్యా కోర్సు ఒఎ) నందు అధ్యాపక పోస్టులలో గెస్టు ఫాకల్టీగా పనిచేడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. శ్రీరామమూర్తి శుక్రవారం తెలిపారు. గెస్టు ఫాకల్టీలకు గంటకు రూ.150 చొప్పున గరిష్టంగా నెలకు రూ. 10 వేలు గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు. ఔత్సాహికులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలు లోగా దరఖాస్తులు కళాశాల కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తుదారులు 20వ తేదీ 10గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని లె లిపారు. విశ్రాంత అధ్యాపకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.


