పాలిసెట్‌లో మెరిసిన గోదావరి విద్యార్థులు | Godavari students who shined in poliset | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో మెరిసిన గోదావరి విద్యార్థులు

Published Sun, May 21 2023 5:19 AM | Last Updated on Sun, May 21 2023 3:00 PM

Godavari students who shined in poliset - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిప్లొమా సాంకేతిక విద్యకు ఉద్దేశించిన పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌– 2023 (పాలిసె­ట్‌)­లో గోదావరి జిల్లాల విద్యా­ర్థుల హవా కొనసాగింది. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 15 మంది 120కి 120 మార్కు­లు సాధించి ప్రథమ–­ర్యాంకర్లుగా నిలిచారు. మొదటి ర్యాంకును కాకినాడ జిల్లాకు చెందిన గోనెళ్ల శ్రీరామ శశాంక్‌ సాధించాడు. మే 10న నిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకులు సి.నాగరాణి శనివారం విజయవాడ­లో విడుదల చేశారు. పరీక్ష జరిగిన పది రోజుల్లోనే ఫలితా­లను వెల్ల­డిం­చామని ఆమె చెప్పారు.

పాలి­సె­ట్‌­కు 1,43,625 మంది హాజరయ్యారని, 1,24,021 మంది (86.35 శాతం) విద్యార్థులు అర్హత సాధిం­చారని చెప్పారు. ఉత్తీర్ణుల్లో 74,633 మంది బాలురు (84.74శాతం), 49,388 మంది బాలికలు (88.90శాతం) ఉన్నట్టు వివరించారు. అత్యధి­కంగా 10,516 మంది విద్యార్థులు విశాఖపట్నం జిల్లా నుంచి అర్హత సాధించారన్నారు. 120 మార్కు­లకు 30 మార్కులు (25 శాతం) అర్హతగా పరిగణించామ­న్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు హాజరైన అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్టు వివరించారు.

ప్రవేశ పరీక్షలో ఒకే మార్కులు పొందిన విద్యార్థులకు గణితం మార్కుల ఆధా­రంగా ర్యాంకులు నిర్ణయించామని, గణితం­లోనూ ఒకేలా వస్తే భౌతిక శాస్త్రం మార్కు­లు, అందులోనూ సమానంగా వస్తే పదో తరగతి మార్కులను పరిగ­ణనలోకి తీసుకున్నా­మన్నారు. అక్కడా సమాన మార్కు­లుంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయ­సున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి­నట్టు చెప్పారు. ర్యాంకు కార్డులను  https://polycetap.nic.in/  వెబ్‌సై­ట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఈనెల 25న వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటిస్తామని,  29 నుంచి కౌన్సెలింగ్‌ ఉంటుందని చెప్పారు. అడ్మిషన్‌ కోసం విద్యార్థులు వెబ్‌ అప్లికేషన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 39 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

31 కోర్సుల్లో 77,177 సీట్లు
ఈ ఏడాది నుంచి నంద్యాల జిల్లా బేతంచెర్ల, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో 840 సీట్లతో కొత్తగా మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో కలిపి మొదటి సంవత్సరం విద్యార్థులకు 268 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో రెండేళ్లు, మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కూడిన 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి గన్నవరం ప్రభుత్వ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్‌లో రెండు కోర్సు­లు, కాకినాడ బాలికల కళాశాలలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం 33 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో కొత్త కరిక్యులమ్‌తో శిక్షణ ఇస్తున్నామన్నారు.

4 వేల మందికి ప్లేస్‌మెంట్స్‌
ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో చివరి సంవత్సరం చదువుతున్న 4 వేల మందికి పైగా విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు సాధించినట్టు వివరించారు. వార్షిక వేతనం అత్యధికంగా రూ.6.25 లక్షలు,  సరాసరి వేతనం రూ.2.50 లక్షలుగా ఉందని చెప్పారు. 84,117 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న విద్యా దీవెన కింద రూ.44.37 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుకున్నారని, 79,768 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న వసతి దీవెనగా రూ.57.44 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారని తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు కార్యదర్శి కేవీ రమణబాబు, జాయింట్‌ డైరెక్టర్‌ వి.పద్మారావు, ప్లేస్‌మెంట్‌ సెల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

120 కి120 మార్కులు సాధించిన విద్యార్థులు
♦  గోనెళ్ల శ్రీరామ శశాంక్‌ (కాకినాడ)
  వనపర్తి తేజశ్రీ (తూర్పు గోదావరి)
    కొంజర్ల శంకర్‌ మాణిక్‌ (తూర్పు గోదావరి)
   దువ్వి ఆశిష్‌ సాయి శ్రీకర్‌ (తూర్పు గోదావరి)
శీల గౌతమ్‌ (తూర్పు గోదావరి)
గ్రంధె గీతిక (తూర్పు గోదావరి)
అగ్గాల కృష్ణ సాహితి (తూర్పు గోదావరి)
    ఉరింకాల జితు కౌముది (తూర్పు గోదావరి)
    పాల గేయ శ్రీ సాయి హర్షిత్‌ (తూర్పు గోదావరి)
   కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ (తూర్పు గోదావరి)
   కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ (పశ్చిమ గోదావరి)
    దొంగ శ్రీ వెంకట శర్వణ్‌ (పశ్చిమ గోదావరి)
   కానూరి భాను ప్రకాష్‌ (పశ్చిమ గోదావరి)
   దుద్దుపూడి రూపిక (తూర్పు గోదావరి)
   కప్పల వెంకటరామ వినేష్‌ (తూర్పు గోదావరి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement