Godarolla Kithakithalu: అక్కా.. బా.. అంటూ.. గోదారోళ్ల కితకితలు.. మామూలుగా లేదుగా మరి..

Godarolla Kithakithalu Facebook Members Get Together In East Godavari - Sakshi

నవ్వులు పూయించిన ‘గోదారోళ్ల కితకితలు’

ఘనంగా ఫేస్‌బుక్‌ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం

వేదికైన బొమ్మూరులోని జీపీఆర్‌ కొండ

రాజమహేంద్రవరం రూరల్‌: బొమ్మూరులోని జీపీఆర్‌ కొండపై ఆదివారం గోదారోళ్ల కితకితలు ఫేస్‌బుక్‌ మిత్రుల ఐదవ ఆత్మీయ సమ్మేళనంలో నవ్వులు విరబూశాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని అక్కా..బా.. అంటూ గోదావరి యాసతో పలకరించుకున్నారు. గోదారోళ్ల కితకితలు ఫేస్‌బుక్‌ క్రియేటర్‌ ఈవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

చదవండి: కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు

చిన్నారులు ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులతో పాటు, ఫేస్‌బుక్‌ మిత్రులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్‌ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్ర స్నాక్స్‌ వరకు సుమారు 40రకాల తెలుగు వంటకాలను ఫేస్‌బుక్‌ మిత్రులకు రుచి చూపించారు. చిన్నారులు, పెద్దలు వేసిన స్టెప్పులు అలరించాయి.

డూప్‌ నాగార్జున, ఇతర డాన్సర్లు చేసిన డ్యాన్స్‌లకు ప్రాంగణం కేరింతలతో హోరెత్తింది. రేడియో జాకీ శీను మామ వ్యాఖ్యానం..చిన్నచిన్న పొడుపు కథలు..ఆటపాటలతో ఉత్సాహంగా సాగింది. గ్రూప్‌ క్రియేటర్‌ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదారోళ్ల సంప్రదాయాలు ఎప్పటికీ కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ఫేస్‌బుక్‌ మిత్రుల గ్రూపు ప్రారంభించామని అన్నారు. వివిధ లక్కీడిప్‌లు నిర్వహించి బహుమతులను అందించారు. అడ్మిన్‌ పేపకాయల లలిత, మోడరేటర్లు సరిత ఎం.బొల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి, బండారు ఆదివిష్ణు, చిలుకూరి విజయ్, కోపల్లె శేషగిరిరావు, నిభనుపూడి వాసుప్రసాద్, కేఎస్‌ఎన్‌ మూర్తి పర్యవేక్షించారు. సుమారు నాలుగువేల మంది గ్రూపు సభ్యులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top