సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తన ఇంటి వద్దకు తరలిరావాలని టీడీపీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న (గురువారం) రాత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న జేసీ వర్గీయులు కుప్పలుగా రాళ్లు వేసి ఉద్రిక్తత సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని రాళ్లను తొలగించారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు తాడిపత్రి పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద, జేసీ వర్గీయుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు మొహరించారు. ఈ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం.



