3 రోజుల్లో 43.15 లక్షల ఇళ్లల్లో ఫీవర్‌ సర్వే

Fever survey above 43 lakh households in Andhra Pradesh - Sakshi

36వ విడత సర్వేలో 26% పూర్తి

1,067 మంది నమూనాల పరీక్ష

42 మందికి పాజిటివ్‌  

చురుగ్గా ప్రికాషన్‌ డోస్‌ టీకా పంపిణీ

సాక్షి, అమరావతి: కరోనా మూడోదశ వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌ నియంత్రణ చర్యలను ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం 36వ విడత ఫీవర్‌ సర్వే ప్రారంభించింది. సోమ, మంగళ, బుధవారాల్లో 26.31 శాతం సర్వేను వైద్యసిబ్బంది పూర్తిచేశారు. 1,61,65,128 ఇళ్లను సర్వే చేయాల్సి ఉండగా మూడు రోజుల్లో 43,15,564 ఇళ్లలో సర్వే పూర్తయింది.

ఆశ వర్కర్, గ్రామ/వార్డు వలంటీర్లు ఇంటింటికి వెళ్లి దగ్గు, జలుబు, జ్వరం, ఇతర కరోనా అనుమానిత లక్షణాలున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం నాటికి జరిగిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 1,653 అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను గుర్తించారు. వీరిలో 1,067 మంది నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపగా 586 ఫలితాలు వెలువడ్డాయి. 42 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికి మందుల కిట్‌లను సిబ్బంది పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలో అత్యధికంగా 39.09 శాతం సర్వే పూర్తయింది. నెల్లూరు జిల్లాలో 35.78 శాతం, విజయనగరం జిల్లాలో 30.73 శాతం సర్వే జరిగింది. 

62.01 శాతం మందికి ప్రికాషన్‌ డోసు
60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్‌ వర్కర్‌లకు ఈ నెల 10వ తేదీ నుంచి కరోనా టీకా ప్రికాషన్‌ డోసు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రికాషన్‌ డోస్‌కు 10,66,617 మంది అర్హులు కాగా ఇప్పటివరకు 6,61,373 (62.01 శాతం) మందికి టీకా అందింది. ప్రికాషన్‌ డోసు టీకా పంపిణీలో నెల్లూరు జిల్లా ముందంజలో ఉంది. ఈ జిల్లాలో 90,119 మందికిగాను 74,123 (82.25 శాతం) మందికి టీకా వేశారు. ప్రికాషన్‌ డోసు పంపిణీలో గుంటూరు జిల్లా వెనుకంజలో ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top