సీఎం సన్నిహితులకేనా జాక్‌పాట్‌? | Farmers anger at CRDA, Chandrababu Govt allocating plots through lottery | Sakshi
Sakshi News home page

సీఎం సన్నిహితులకేనా జాక్‌పాట్‌?

May 11 2026 5:08 AM | Updated on May 11 2026 9:04 AM

Farmers anger at CRDA, Chandrababu Govt allocating plots through lottery

లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు తీరును ప్రశ్నిస్తున్న రాజధాని రైతులు

నీరుకొండలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూతురు 5.39 ఎకరాలు సీఆర్‌డీఏకు అప్పగింత 

ఫలితంగా వెస్ట్‌ బైపాస్‌కు పక్కనే 1,500 గజాల చొప్పున రెండు.. 1,000 గజాల చొప్పున మరో రెండు నివాస ప్లాట్లు కేటాయింపు   

ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి ఎదురుగా కూడలిలో 660 గజాల చొప్పున ఇంకో రెండు వాణిజ్య పాట్లు 

చంద్రబాబుకు సన్నిహితులైన బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకూ ఇదే రీతిలో ప్రాధాన్యం  

సచివాలయానికి కూతవేటు దూరంలో, సీఎం ఇంటికి సమీపంలో ప్లాట్ల కేటాయింపు

వారు సీఎం కోటరీ కావడం వల్లే చేతివాటం ప్రదర్శించారని ప్రభుత్వం, సీఆర్‌డీఏపై రైతుల ఆగ్రహం 

తమకేమో చెరువులు, వాగులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలిచ్చారని మండిపాటు

సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్‌ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్‌ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్‌ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్‌డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్‌ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులు ఇలానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కోటరీలోని ముఖ్యులకు, టీడీపీ ప్రజా ప్రతినిధుల సన్నిహితులకు రోడ్ల పక్కనే అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. 

ఇందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, కూతురు వేమూరి అనూషకు వెస్ట్‌ బైపాస్‌ పక్కనే నివాస, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడాన్ని ఎత్తిచూపుతున్నారు. లాటరీలో రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకే జాక్‌పాట్‌ తగిలిందా.. మాకు తగలదా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలుతోపాటు.. అభివృద్ధి చేసిన లే అవుట్‌లలో ఎకరానికి జరీబు భూమైతే 1,000 గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు.. మెట్ట భూమైతే 1,000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ కింద లే అవుట్‌లలో సీఆర్‌డీఏ అధికారులు లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లను కేటాయించి, రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నారు.  

బెజవాడ రమేషా.. మజాకా! 
తుళ్లూరు మండలం మందడంకు చెందిన బెజవాడ రమేష్‌ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. మందడంలో సర్వే నెంబరు 496/4, 387/2, 143, 22/2, 40, 21/1, 88, 2బీ/4, 139/ఏ, 512/2, 3బీ–0, 6బీ, 455/1ఏ, 131/1, 272బీ, 54బీ/4, 59/ఏ, 57/బీ, 73/2, 29/1, 59/బీ, 136, 135/2, 33/4లలో బెజవాడ రమేష్‌, బెజవాడ సుప్రియ, బెజవాడ మధు, బెజవాడ బ్రా­హ్మణి, బెజవాడ సాంబశివరావుల కుటుంబం 31.245 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏకు ఇచ్చింది. ఇందుకుగానూ ఏటా వారి కుటుంబ సభ్యులకు సీఆర్‌డీఏ కౌలు చెల్లిస్తోంది. కోర్‌ క్యాపిటల్‌ ఏరియా(ప్ర«దాన రాజధా­ని ప్రాంతం)లో సచివాలయానికి ఎదురుగా నాలు­గు రోడ్ల జంక్షన్‌ (కూడలి)లో బెజవాడ రమేష్‌, మధులకు లాటరీ ద్వారా 2,500 గజాల వాణిజ్య ప్లాటును సీఆర్‌డీఏ కేటాయించింది. ప్రస్తుతం దాంట్లో బీఎస్సార్‌ ప్రాపర్టీస్‌ పేరుతో భవనం నిర్మించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీకి అద్దెకు ఇచ్చారు.


బెజవాడ రమేష్, మధుకు కేటాయించిన 2500 గజాల వాణిజ్య ప్లాట్లు 
 
బిట్స్‌ పిలానీ విద్యా సంస్థకు కేటాయించిన భూమికి సమీపంలో రోడ్డు పక్కనే 13,500 గజాల ఇంటి స్థలం బెజవాడ రమేష్‌ కుటుంబ సభ్యులకు లాటరీ ద్వారా సీఆర్‌డీఏ కేటాయించింది. సచివాలయానికి కూతవేటు దూరంలో 25 మీటర్లు, 17 మీటర్ల రెండు రోడ్ల కూడలిలలో 4,500 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్‌కు లాటరీ ద్వారా ఇచ్చింది. ఎన్‌–6 ప్రధాన రహదారికి  ఆనుకుని 5,940 గజాల చొప్పున పక్కపక్కనే రెండు వాణిజ్య ప్లాట్లను, సచివాలయం పక్కనే రెండు రోడ్ల కూడలిలో 4,860 గజాల పరిమాణం కలిగిన నివాస ప్లాటును, సచివాలయం పక్కనే ప్రధాన రహదారికి ఆనుకుని 2,400 గజాల నివాస ప్లాటును బెజవాడ రమేష్‌ కుటుంబానికి కేటాయించింది. బెజవాడ రమేష్‌ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే లాటరీలో ఇలా జాక్‌పాట్‌ తగిలిందని.. అదే తమకు ఎందుకు తగలలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కీలక ప్రాంతాల్లో రాధాకృష్ణ కొడుకు, కూతురుకు ఆరు ప్లాట్లు  
రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెలు మంగళగిరి మండలం కురగల్లు రెవెన్యూ గ్రామం పరిధిలోని నీరుకొండలో సర్వే నెంబరు 71, 72, 73లో 5.39 ఎకరాలు కొనుగోలు చేసి.. 2016 అక్టోబర్‌ 30న రిజి్రస్టేషన్‌ చేయించుకుని.. భూ సమీకరణ కింద సీఆర్‌డీఏకు అప్పగించారు. ఇందుకుగాను ఇతర రైతులలానే వారికి సీఆర్‌డీఏ ఏటా కౌలు చెల్లిస్తోంది. రాధాకృష్ణ కొడుకు ఆదిత్యకు వెస్ట్‌ బైపాస్‌కు పక్కనే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు.. కూతురు అనూషకూ అక్కడే 1,500 గజాలు, 1,000 గజాలు ఉన్న రెండు నివాస ప్లాట్లు దక్కాయి. ఇక ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఇద్దరికీ 660 గజాల చొప్పున వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఈ ఆరు ప్లాట్లు లాటరీ ద్వారానే వారికి దక్కడం గమనార్హం.  


కోరుకున్న చోట ధనేకులకు ప్లాట్లు
ధనేకుల సుబ్బారావు తుళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కొండమరాజుపాలెంలో సర్వే నెంబరు 66/1ఏలో 0.47, నేలపాడులో సర్వే నెంబరు 95/ఏలో 0.50, 9/ఏలో 0.86, 93/1సీలో ఎకరం, 66/2లో 0.53, 93/1ఏలో 5.53, 93/1బీ 0.60, 98లో 0.10 వెరసి 9.59 ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏకు ఇచ్చారు. ఈయన కుటుంబ సభ్యులు కూడా భారీగానే భూములు ఇచ్చారు. ఇందుకుగాను వారికి సీఆర్‌డీఏ కౌలు చెల్లిస్తోంది. అయితే అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్ల­ను లాటరీ ద్వారా కేటాయించడంలో మాయాజాలం చోటుచేసుకుంది. «కొత్తగా నిర్మింస్తున్న శాశ్వత హైకోర్టుకు అత్యంత సమీపంలో డైమండ్‌ సర్కిల్‌ దగ్గర ఎన్‌10 రోడ్డు పక్కనే 24,500 గజాల నివాస ప్లాటు, ఈ ప్లాటు పక్కనే 11,820 గజాల నివాస ప్లాటు, సీఎం చంద్రబాబు కొత్తగా నిర్మింస్తున్న ప్యాలెస్‌కు సమీపంలో ఎన్‌11 ప్రధాన రహదారికి ఆనుకుని 2,520 గజాల వాణిజ్య ప్లాటును, హైకోర్టుకు కూతవేటు దూరంలో ఎన్‌9 రోడ్డు పక్కనే 8,820 గజాల మరో వాణిజ్య ప్లాటును ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు సీఆర్‌డీఏ లాటరీ ద్వారా కేటాయించింది. 

ఇదిగో ప్లాట్ల మాయాజాలం!  
 

రైతుల్లో ఆగ్రహం 
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 53,748 ఎకరాల(217 చదరపు కిలోమీటర్లు)ను రాజధాని ప్రాంతంగా 2015లో చంద్రబాబు సర్కార్‌ ప్రకటించింది. ఇందులో 34,823.12 ఎకరాలను 29,442 మంది రైతుల నుంచి భూ సమీకరణ కింద సమీకరించింది. వారికి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో నివాస, వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయిస్తోంది. రోడ్లకు పక్కన, సమీపంలో.. నాలుగు రోడ్ల కూడలి.. ప్రధాన ప్రాంతాల్లో ని­వాస, వాణిజ్య ప్లాట్లు సీఎం చంద్రబాబు సన్నిహితు­లు, టీడీపీ ప్రజా ప్రతినిధుల మద్దతు ఉన్న వారికే ద­క్కుతున్నాయని.. తమకు పల్లపు ప్రాంతం, చెరువు­లు, వాగుల్లో వస్తున్నాయంటూ రైతులు ఆగ్రహం వ్య­క్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు, కూ­తురుతోపాటు బెజవాడ రమేష్‌, ధనేకుల సుబ్బా­రావు వంటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులైన టీడీ­పీ నేత­ల కుటుంబ సభ్యులకు అత్యంత ప్రధానమైన ప్రాంతా­ల్లో వేలంలో దక్కిన ప్లాట్లను వారు ఎత్తిచూపుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement