నకిలీ నోట్ల ముఠా పట్టివేత | Fake Currency Gang Arrested in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్ల ముఠా పట్టివేత

May 18 2026 5:08 AM | Updated on May 18 2026 5:08 AM

Fake Currency Gang Arrested in Andhra Pradesh

సీఎం చంద్రబాబునాయుడితో నకిలీ నోట్ల చెలామణిలో ముద్దాయిగా ఉన్న టీడీపీ నాయకుడు సెల్వం కుమారుడు డిచ్‌ (ఫైల్‌)

ఐదుగురి అరెస్ట్‌

వీరిలో ఇద్దరు పోలీసులు, ఒకరు టీడీపీ నేత  

కార్వేటినగరం: రూ.10 లక్షలకు రూ.కోటి నకిలీనోట్లు ఇస్తామంటూ ఇద్దరిని మోసగించిన ఐదుగురిని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులు కాగా ఒకరు టీడీపీ నాయకుడు. జీడీ నెల్లూరు మండలం బట్టుకండ్రిగ డంపింగ్‌ యార్డు వద్ద శనివారం అరెస్టు చేసిన నిందితుల్ని ఆదివారం చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్‌ విధించడంతో నిందితుల్ని చిత్తూరు జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సెల్వం.. మిట్టవేల్కూరు గ్రామ టీడీపీ నాయకుడు. సెల్వం కుమారుడు డిచ్‌ సీఎం చంద్రబాబునాయుడుతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిందితుల్లో లోకనాథం చిత్తూరులో ట్రాఫిక్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తుండగా, రవిచంద్రన్‌ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌.

ఈ కేసు వివరాలను జీడీ నెల్లూరు పోలీసులు ఆదివారం తెలిపారు. వారు తెలిపిన మేరకు.. వేలూరు జిల్లా సైదాపేటకు చెందిన ఇళంగోవన్, జీడీ నెల్లూరు మండలం మిట్టవేల్కూరు దళితవాడకు చెందిన సెల్వం, అదే గ్రామానికి చెందిన లక్ష్మణకుమార్, వేల్కూరు గ్రామానికి చెందిన రవిచంద్రన్‌ (రవి), పెనుమూరు మండలం గుడ్యాణంపల్లికి చెందిన లోకనాథం (లోక) ముఠాగా ఏర్పడి నకిలీనోట్లు ఇస్తామని తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మంజు, విజయ్‌లను సంప్రదించారు.

రూ.10 లక్షలు ఇస్తే రూ.కోటి నకిలీనోట్లు ఇస్తామని చెప్పి బట్టుకండ్రిగ వద్దకు పిలిచారు. వారితో ముఠాలోని కొందరు సభ్యులు మాట్లాడుతుండగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకుని బెదిరించి బాధితుల వద్ద ఉన్న నగదు, మొబైల్‌ ఫోన్లు లాక్కెళ్లారు. బాధితులు వెంటనే జీడీ నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement