జనరిక్‌ మందులపై విస్తృత ప్రచారం

Extensive Publicity On Generic Drugs - Sakshi

అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ప్రధానమంత్రి సూచన

కడప–బెంగళూరు  బ్రాడ్‌ గేజ్‌ రైల్వే  పనులపై మోదీ సమీక్ష

భూసేకరణ పురోగతిని వివరించిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

సాక్షి, అమరావతి:  జనరిక్‌ మందుల వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కడప, చిత్తూరు జిల్లాల మీదుగా నిర్మించే కడప–బెంగళూరు 268 కి.మీ. పొడవున నూతన బ్రాడ్‌ గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణ పనుల ప్రగతిని ప్రధాని ఏపీ, కర్ణాటక సీఎస్‌లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) పథకంపై మోదీ సమీక్షించారు. ప్రధాని మాట్లాడుతూ జనరిక్‌ మందుల వినియోగంపై సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. జనరిక్‌ మందుల కేంద్రాల ఏర్పాటుకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సివిల్‌ ఆస్పత్రుల్లో అద్దెలేని స్థలాలను కల్పించాలని సూచించారు.
 
అటవీ క్లియరెన్స్‌ రావాల్సి ఉంది
నూతన బ్రాడ్‌ గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి వైఎస్సార్‌ కడప జిల్లాలో 56.04 హెక్టార్ల భూమికి అటవీ క్లియరెన్స్‌ రావాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పారు. విజయవాడ సీఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్‌ మాట్లాడుతూ నూతన బ్రాడ్‌ గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో 56 హెక్టార్ల భూమికి అటవీ అనుమతులు రావాల్సి ఉందని  తెలిపారు.

జన ఔషధి పరియోజన అమలుకు చర్యలు
ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, జనరిక్‌ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు చేపట్టామని సీఎస్‌ వివరించారు. రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్, బోర్డ్‌ ఆస్పత్రులు జనరిక్‌ మందులు వినియోగంలో మంచి ఫలితాలు సాధించాయని, మిగతా అన్ని ఆసుపత్రుల్లో జనరిక్‌ మందుల వినియోగంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సెక్రటరీ సర్వీసెస్‌ శశిభూషణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top