గ్యాస్‌ సిలిండర్‌కి ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది!..గడువు దాటితే ప్రమాదమే

Exceed Expired Date Of Gas Cylinder Dangerous At Vizayanagaram - Sakshi

బలిజిపేట: గ్యాస్‌ కనెక్షన్‌ కొనుగోలు చేసి వినియోగించడం ప్రస్తుతం ఎంత అవసరమో, దాని వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం.  జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందులో అత్యంత ముఖ్యమైనది గ్యాస్‌ సిలిండర్‌కూ కాలపరిమితి ఉంటుందని తెలియకపోవడమే. గ్యాస్‌ సిలిండర్‌కు ఉండే కాలపరిమితిని సాధారణంగా ఎవరూ గమనించరని, కాలపరిమితి దాటితే పెనుప్రమాదం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ ఎక్స్‌పైరీ తేదీ ముగిసినా వినియోగిస్తే గ్యాస్‌ లీయయ్యే ప్రమాదం ఉందంటున్నారు.   సరఫరా చేసే ప్రతి సిలిండర్‌పై ఎక్స్‌పైరీ సంవత్సరాన్ని, నెలను కోడ్‌ విధానంలో మెటల్‌ ప్లేట్‌పై వంటగ్యాస్‌ కంపెనీలు ముద్రిస్తాయి.  సిలిండర్‌ మారుతున్నప్పుడల్లా ఎక్స్‌పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని హితవు పలుకుతున్నారు.  

కాలపరిమితిని ఎలా గుర్తించాలంటే..  
సిలిండర్‌ మెటల్‌ ప్లేటుపై ఆంగ్ల అక్షరంతో సంవత్సరం, నెల  ఉంటుంది.  దాని ప్రకారం అది ఏసంవత్సరం, ఏనెల తరువాత ఎక్స్‌పైరీ అవుతుందో తెలుస్తుంది.  ఉదాహరణగా ఎ–24అని ఉంటే ఆ సిలిండర్‌ 2024 మార్చిలో ఎక్స్‌పైర్‌ అవుతుందని అర్థం. ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక.  ఎ  అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బి అక్షరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు, సి అక్షరం జూలై నుంచి సెప్టెంబరు వరకు, డి అక్షరం అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు అని గుర్తించాలి.   

గడువును గుర్తించాలి 
సిలిండర్‌ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్‌ ప్లేట్‌పై కోడ్‌ విధానంలో ఉండే ఎక్స్‌పైరీ గడువును గుర్తించి తీసుకోవాలి.  అది నెల రోజులకు సమీపంలో ఉంటే అటువంటి సిలిండర్‌ను తీసుకోకూడదు.  చిన్నచిన్న కుటుంబాలవారు, అతి తక్కువ వేతనం సంపాదించేవారు గ్యాస్‌ వినియోగం ఎక్కువ రోజులు చేస్తుంటారు. కనుక ఎక్స్‌పైరీ తేదీ లోపల వారి సిలిండర్‌ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అటువంటి సిలిండర్లతో ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. అందుకు గడువును గుర్తించి సిలిండర్‌ తీసుకోవాలి. దానిస్థానంలో వేరే సిలిండర్‌ అడిగే హక్కు వినియోగదారునికి ఉంది. 

సిలిండర్‌కు పదేళ్ల గడువు 
సిలిండర్‌ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది.  సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్‌తో  బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌(బీఐఎస్‌) ప్రమాణాలతో తయారుచేస్తారు.  బీఐఎస్‌ అనుమతుల తరువాతే సిలిండర్‌ మార్కెట్‌లోకి వస్తుంది.   

గడువు ముగిసేవి ఉండవు 
గ్యాస్‌ సిలిండర్లు గడువు ముగిసేవి ఉండవు.  ముందే వాటిని కండెమ్‌ సరుకుగా తీసివేస్తారు.  తయారై వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తారు. పకడ్బందీగా చర్యలు ఉంటాయి. 
హర్ష, గ్యాస్‌ ఏజెన్సీ యజమాని, పలగర, బలిజిపేట మండలం  

(చదవండి: రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్‌ పొలంబడి లక్ష్యం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top