పునరుత్పాదక రంగంలో ఉపాధి వెలుగులు

Employment growth up in reproductive sector - Sakshi

25 ఏళ్లలో మిలియన్‌కు పైగా ఉద్యోగాలు 

తగ్గనున్న 229 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలు 

గ్లోబల్‌ విండ్‌ ఎనర్జీ కౌన్సిల్‌ నివేదిక 

మన రాష్ట్రంలోనూ శిలాజయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం 

10,785.51 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం 

సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. వీటి ద్వారా కాలుష్యాన్ని నివారించడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కూడా కల్పించవచ్చు. కేవలం పవన విద్యుత్‌ ద్వారా దేశంలో మిలియన్‌కు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చని గ్లోబల్‌ విండ్‌ ఎనర్జీ కౌన్సిల్‌ (జీడబ్యూఈసీ ) తెలిపింది. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో పవన శక్తి నుండి గ్రీన్‌ రికవరీ అవకాశాలను సంగ్రహించడం’ అనే అంశంతో విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. ఇండియా, బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది.

ఈ ఐదు దేశాలూ కోవిడ్‌ –19 సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ గ్రీన్‌ రికవరీ చర్యల్లో ఆర్థిక వృద్ధిని సాధించగల పవన విద్యుత్‌ వనరులను కలిగి ఉన్నాయని వెల్లడించింది. పవన విద్యుత్తులో ఐదు దేశాలు కలిపి 25 ఏళ్లలో 2.23 మిలియన్‌ ఉద్యోగాలు, దాదాపు 20 గిగావాట్ల అదనపు విద్యుత్‌ సాధిస్తాయని చెప్పింది. దాదాపు 25 మిలియన్ల గృహాలకు విద్యుత్‌ అందించవచ్చని వెల్లడించింది. భారత దేశంలో 25 సంవత్సరాల్లో అదనంగా 229 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా వేసింది.
 
ఏపీ సామర్ధ్యం 10,785.51 మెగావాట్లు 
దేశంలో నూతన, పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 1,56,347.45 మెగావాట్లు. ఏపీలో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 162.11 మెగావాట్లు చిన్న జలశక్తి వనరుల ద్వారా, 1,610 మెగావాట్లు పెద్ద జలశక్తి వనరుల ద్వారా, 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 536.04 మెగావాట్లు బయో విద్యుత్, 4,380.71 మెగావాట్లు సోలార్‌ విద్యుత్‌ ఉన్నాయి. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడానికి సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీని ద్వారా పునరుత్పాదక వనరుల విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ఏపీ భాగమవుతోంది. 

ప్రభుత్వాల ఉమ్మడి చర్యలు 
శిలాజయేతర ఇంధన వనరుల నుండి 2030 నాటికి 500 గిగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ఆటోమేటిక్‌ రూట్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను అనుమతిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్రాన్స్‌మిషన్‌ లైన్‌లు వేయడం, కొత్త సబ్‌ స్టేషన్ల నిర్మాణం వంటి చర్యలు చేపట్టింది. సౌర, పవన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి కేంద్రం 2025 జూన్‌ 30 వరకూ ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌ మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌) చార్జీలు మినహాయింపు ఇచ్చింది. ఏపీ తీసుకునే సోలార్‌ విద్యుత్‌కు కూడా ఐఎస్‌టీఎస్‌ చార్జీల మినహాయింపు వర్తించనుంది. ఈ చర్యలతో పునరుత్పాదక రంగం బలపడి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top