ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా తన గ్రూపు సంస్థల విషయానికి వచ్చేసరికి కళ్లు మూసేసుకుంటుంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఈనాడు గ్రూపు సంస్థలు మీడియా బలంతో తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగూ వారి ఇంటి మనిషే. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ కూడా గురువు బాటలోనే నడుస్తూ ఈనాడు గ్రూపునకు వంత పాడుతున్నారన్న విమర్శ ఉంది.
ఆర్బీఐ చట్టం ప్రకారం... అవిభాజ్య హిందూ కుటుంబం తరఫున ప్రజల నుంచి డిపాజిట్ల వసూలు చేస్తే సేకరించిన మొత్తానికి రెట్టింపు జరిమానా, జైలు శిక్షకు గురి అవుతారు. అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ప్రజల నుంచి రూ.2600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందన్నది ఆరోపణ. రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఈ విషయమై కోర్టుకెక్కారు. ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం వ్యవస్థల్లోని లోపం. ఈ వివాదం మొదలయ్యాక రామోజీరావు టీవీ ఛానళ్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు తిరిగి చెల్లించినట్లుగా చెబుతారు కానీ... అందులో మతలబులు ఉన్నాయన్నది ఉండవల్లి వాదన. అందుకే ఆయన అప్పట్లో డిపాజిటర్ల జాబితా కోరారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉన్న కేసును కొట్టి వేస్తే ఆ విషయం వ్యాజ్యం వేసిన ఉండవల్లికి కొన్ని నెలలపాటు తెలియకపోవడం. సమాచారం తెలుసుకున్న ఉండవల్లి సుప్రీంకోర్టు ఆశ్రయించడం, న్యాయస్థానం ఆదేశించడంతో కేసు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. అయితే అప్పటికి సంస్థ అధినేత రామోజీ రావు మరణించినందున, రెండు రాష్ట్ర ప్రభుత్వాల అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు కేసును కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత టర్మ్‌లో ఏపీలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం డిపాజిట్ల సేకరణలో జరిగిన తప్పులను ఎత్తిచూపి అఫిడవిట్ దాఖలు చేసింది. కాని ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్ మరో వైఖరి తీసుకుంది. రామోజీరావు మరణించారు కనుక ఆ కేసును ఎత్తివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ కోర్టును కోరాయి.
చట్టం ప్రకారం ఇది చెల్లుతుందా అన్న చర్చ జరుగుతోంది. నేరం జరిగిన తర్వాత సంబంధిత సంస్థ యజమాని మరణిస్తే, ఆ కంపెనీ బాధ్యత తీరిపోతుందా అన్నదే ప్రశ్న. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతామని తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నందున క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని అభిప్రాయపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్ తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గి వాదిస్తూ రామోజీరావు మరణించినందున కేసు ముగించాలని కోరగా, ఉండవల్లి అరుణకుమార్ తరపు న్యాయవాది కె.పరమేశ్వర్ అభ్యంతరం తెలిపి వ్యక్తి మరణించినా జరిగిన నేరానికి జరిమానా చెల్లించాల్సిందేనని వాదించారు. అత్యున్నత కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు నోటీసులు జారీ చేసింది.
అక్రమంగా రూ.2600 కోట్ల డిపాజిట్లు సేకరించారని ఆ డబ్బును ఇతర కంపెనీలకు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణగా. అంతిమంగా ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పలేం. కాకపోతే నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్‌పై, ఆ పార్టీ నేతలపైన విషం చిమ్ముతూ వార్తలు ప్రచారం చేసే ఈనాడు గ్రూపు మీడియా తన వరకు వచ్చేసరికి ఎలా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ అవుతుంది. ఈ మధ్య టీటీడీ లడ్డూ వివాదంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దినేష్ కుమార్ ఇచ్చిన నివేదికపై విశ్లేషణలు ఇస్తూ వైసీపీ నేతలపై దారుణమైన కథనాలను రాసింది. ఇదొక్కటే కాదు. అనేక అంశాలలో వైసీపీ తన రాజకీయ ప్రత్యర్థి అన్నట్టుగా ఇష్టారీతిలో స్టోరీలు ఇస్తుంటుంది.
గతంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై కమిటీ వేసి పరిశీలన చేయాలని ఆదేశించినా, ఆ తర్వాత దానిని ఫాలో అప్ చేయలేదన్నద ఆరోపణట. అలా చేయలేదు కనుక ఆయనను కూడా దోషిగా చూపాల్సిందేనని ఎల్లో మీడియా వాదన. ఆయనను వదలి వేస్తారా అంటూ రాజకీయ నేతల కన్నా ఎక్కువగా వాపోతూ కథనాలు ఇచ్చింది. అలాగే నెయ్యి కొనుగోలు కమిటీలో ప్రస్తుత మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గత టర్మ్‌లో సభ్యులుగా ఉన్నారు.వారి గురించి మాట మాత్రం రాయకుండా ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు బాధ్యులని దినేష్ కుమార్ నివేదికలో ఉందట. దాని ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఈ మీడియా ప్రచారం చేసింది.
నిత్యం ఎప్పుడో వైసీపీ హయాంలో ఆ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది! ఇప్పటికీ వైసీపీ అనుకూల అధికారులు ఆయా సంస్థలలో పనిచేస్తున్నారంటూ పిచ్చి వార్తలు రాసే ఈనాడు మీడియా కు సుప్రీంకోర్టులో మార్గదర్శి డిపాజిట్ల కేసులో మాత్రం ఎందుకు కిక్కురుమనలేకపోయింది? వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై చెప్పిన అభిప్రాయం ఆసక్తికరంగా ఉంది. 'తన దగ్గర లైసెన్స్ లేని తుపాకి ఉందని, కాని ఎప్పుడూ ఎవరిని కాల్చలేదని, కేసు రాగానే తిరిగి ఇచ్చేశానని చెబితే చెల్లుతుందా?" అని ఆయన ప్రశ్నించారు. మరో వాదన కూడా వస్తోంది. రామోజీరావు ఈ కేసులో తప్పు చేసినట్లు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ఒప్పుకున్నట్లేనా అన్నది ప్రశ్న.
తప్పు చేసినా ఆయన మరణించారు కనుక కేసు ఎత్తివేయాలని కోర్టులో వాదిస్తున్నారా? అన్న చర్చ నడుస్తోంది. తమకు గిట్టనివారిపై ఉన్నవి,లేనివి రాసి నిత్యం బదనాం చేసే పనిలో ఉండే ఈనాడు ఈ కేసులో లాజిక్కు ఏమిటో వివరించి ఉంటే బాగుండేది కదా! పలుకుబడి కలిగిన తమకు ఆర్బీఐ నిబంధనలు వర్తించవని రాసి ఉండాల్సింది కదా! చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


