గౌతమ్ సవాంగ్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే తన ప్రధాన లక్ష్యాలని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, సామాన్యుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. పూర్తి అదనపు బాధ్యతలతో రాష్ట్ర డీజీపీగా శనివారం ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గౌతం సవాంగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. మత సామరస్యానికి భంగం కలిగించే, ఇతరత్రా అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
క్షేత్ర స్థాయి నుంచి పోలీసు వ్యవస్థ పూర్తి బాధ్యత, జవాబుదారీతనంతో పని చేసేలా సమన్వయపరుస్తామని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి నిబద్ధతతో వ్యవహరించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. దిశ యాప్, దిశ మహిళా పోలీసు వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసుల నియామకం.. తదితర చర్యలతో క్షేత్ర స్థాయిలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమైందని చెప్పారు. గంజాయి సాగు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలైనవి పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తదనుగుణంగా కొత్తగా పోలీసు జిల్లాలు, యూనిట్లను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. అందుకోసం ఇప్పటికే ఓ కమిటీని నియమించామని తెలిపారు. ప్రముఖుల పర్యటనల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అదనపు డీజీ (శాంతి భద్రతలు) నేతృత్వంలో ఓ కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు.
దుర్గమ్మ పంచ హారతుల సేవలో డీజీపీ
రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణితో కలిసి అమ్మవారి పంచ హారతుల సేవలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: సవాంగ్
రాష్ట్ర ప్రజలకు డీజీపీగా రెండేళ్ల 8 నెలల పాటు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గౌతం సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని నిష్పక్షపాతంగా పనిచేసి, పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేశామన్నారు. బదిలీని పురస్కరించుకుని పోలీసు అధికారులు మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో శనివారం సవాంగ్ దంపతులున్న ప్రత్యేక వాహనాన్ని అధికారులు తాళ్లతో లాగుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. సవాంగ్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దిశ యాప్‌ను 1.10 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై 40 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 7,552 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం దేశంలోనే రికార్డని చెప్పారు. తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


