17,269 కుటుంబాలకు పునరావాసం

CS‌ Adityanath das Order to the Officers on Polavaram Rehabilitation Works - Sakshi

గోదావరికి వరద వచ్చేలోగా కల్పించాలి

పోలవరం పునరావాస పనులపై అధికారులకు సీఎస్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 90 గ్రామాలకు చెందిన 17,269 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సహాయ పునరావాస విభాగం, జలవనరులశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదేశించారు. ఆయన మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జలవనరులు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణశాఖ, సహాయ పునరావాస విభాగం ఉన్నతాధికారులతో వర్చువల్‌ విధానంలో సమీక్షించారు. 90 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు 73 కాలనీలను నిర్మించాలని, ఇందులో 26 కాలనీలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయని, మిగిలిన 46 కాలనీలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు. గృహనిర్మాణశాఖ, పంచాయతీరాజ్‌శాఖల నేతృత్వంలో చేపట్టిన పునరావాస కాలనీల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ సూచించారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పునరావాస కాలనీల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని, గ్యాప్‌–3లో ఖాళీ ప్రదేశం భర్తీ పనులు కొలిక్కి వచ్చాయని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. ఈనెల 25నాటికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీలను భర్తీచేస్తామని చెప్పారు. జూన్‌ నెలాఖరునాటికి కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తవుతాయని, గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి అవసరమైన అన్ని పనులు పూర్తిచేస్తామని తెలిపారు.  

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top