
సాక్షి,అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో వాయిదా పడిన శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. అయితే, సభలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగుతోంది. పీపీపీ విధానం రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మండలి పోడియంను చుట్టుముట్టారు. ఈ నినాదాల మధ్య మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
అంతకుముందు ఏపీ శాసన మండలి వాయిదా పడింది. మండలి సమావేశాల నేపథ్యంలో శుక్రవారం సభలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే సభలో చర్చించాలని ప్లకార్డ్‌లతో నినాదాలు చేశారు. అయితే, వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో శాసనమండలి ఛైర్మన్ ఏపీ శాసన మండలిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.