వ్యాపారంపై ‘సెకండ్‌’ దెబ్బ

Corona Second Wave that damaged retail stores - Sakshi

రిటైల్‌ దుకాణాలను దెబ్బతీసిన కరోనా సెకండ్‌ వేవ్‌

వారం రోజుల్లో 50 శాతం పడిపోయిన అమ్మకాలు

మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా  

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నుంచి మెల్లగా కోలుకుంటున్న రిటైల్‌ వాణిజ్య రంగంపై సెకండ్‌ వేవ్‌ గట్టి దెబ్బకొట్టింది. గత వారం రోజులుగా షాపులకు వచ్చే వారి సంఖ్య 50 శాతం వరకు పడిపోయిందని రిటైలర్లు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ షోరూంలకు రోజుకు సగటున 50 నుంచి 60 మంది వరకు వినియోగదారులు వచ్చే వారని.. ఇప్పుడు ఆ సంఖ్య 30 దాటడం లేదని విజయ్‌ సేల్స్‌ (పాత టీఎంసీ) ప్రతినిధి చంద్రశేఖర్‌ ‘సాక్షి’కి తెలిపారు. వేసవిలో ఎలక్ట్రానిక్స్‌ షాపులు కళకళలాడుతుంటాయని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని సోనోవిజన్‌ అధినేత భాస్కరమూర్తి పేర్కొన్నారు. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల కోసం కొద్ది మంది వినియోగదారులు వస్తున్నారని.. టీవీలు, వాషింగ్‌ మిషన్లు తదితర గృహోపకరణ వస్తువుల అమ్మకాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని చెప్పారు. గతేడాది లాక్‌డౌన్‌ వల్ల వేసవి అమ్మకాలు తుడిచిపెట్టుకుపోయాయని వివరించారు. ఇప్పుడు ఉగాది, శ్రీరామనవమి, రంజాన్‌ పండుగలు వచ్చినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. మార్చి చివరి వారంతో పోలిస్తే వ్యాపారం విలువ 30 శాతం పడిపోయిందని తెలిపారు. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వీరు చెబుతున్నారు. షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుండటంతో.. రిటైల్‌ సంస్థలు ఆన్‌లైన్‌ అమ్మకాలపై దృష్టి సారిస్తున్నాయి. 

దుస్తుల దుకాణాలు వెలవెల..
సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి మహిళలు షాపింగ్‌కు రావడం తగ్గించారని.. దీంతో దుస్తుల దుకాణాలు వెలవెలబోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ 10 వరకు బాగానే ఉన్న వ్యాపారం.. ఆ తర్వాత 40 శాతం పడిపోయిందని కళానికేతన్‌ ఎండీ నాగభూషణం తెలిపారు. సెకండ్‌ వేవ్‌ వల్ల షాపింగ్‌కు రావడానికే వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారని.. నష్టమైనా కోవిడ్‌ నియంత్రణ చర్యలు పాటిస్తూ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, జనవరి నుంచి బంగారం ధరలు దిగొస్తుండటంతో కొంతకాలంగా ఆభరణాల షాపులు కళకళలాడుతున్నాయి. రూ.52,000 దాటిన పది గ్రాముల బంగారం ధర.. పది వేల రూపాయల వరకు దిగి రావడంతో ప్రజలు కొనుగోళ్లకు ముందుకు వచ్చారని ఎంబీఎస్‌ జువెల్లరీ పార్టనర్‌ ప్రశాంత్‌ జైన్‌ తెలిపారు. గత వారం రోజులుగా కస్టమర్ల సంఖ్య తగ్గిందని వివరించారు. కేసుల ఉధృతి తగ్గే వరకు తమకు కష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top