5 వేల మెట్రిక్‌ టన్నుల మామిడి ఎగుమతులకు ఒప్పందాలు

Contracts for export of 5 thousand metric tons of mangoes - Sakshi

ఫలించిన ఉద్యాన శాఖ ప్రయత్నాలు

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మామిడి ఎగుమతులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రొసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అపెడా) సౌజన్యంతో ఉద్యానశాఖ మంగళవారం విజయవాడలో ఓ హొటల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బయ్యర్లు–సెల్లర్ల మీట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఇందులో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన సుమారు వంద మందికి పైగా మామిడి రైతులు, దేశం నలుమూలల నుంచి ఏటా దేశ విదేశాలకు ఎగుమతి చేసే 55 మంది అంతర్జాతీయ ఎగుమతిదారులు, ట్రేడర్లు పాల్గొన్నారు.

ఈ మీట్‌లో 5 వేల మెట్రిక్‌ టన్నుల మామిడి ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు రైతులు–ఎగుమతిదారుల మధ్య జరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది హెక్టార్‌కు 15 టన్నుల చొప్పున 56 లక్షల టన్నులకుపైగా మామిడి దిగుబడులు రానున్న దృష్ట్యా ఆ స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో విజయవాడ, తిరుపతిలలో బయ్యర్స్‌– సెల్లర్స్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ..మామిడి ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరగాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు.

అపెడా ఏజీఎం నాగ్‌పాల్‌ మాట్లాడుతూ..మామిడిని విదేశాలకు ఎగుమతులు చేయాలనుకునే రైతులు అపెడా వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖాముఖి భేటీలో పలువురు ఎక్స్‌పోర్టర్స్‌ మాట్లాడుతూ అమెరికా, సింగపూర్, లండన్‌ తదితర దేశాలకు  ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున ఆర్డర్స్‌ వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ కార్గోహెడ్‌ అబ్రహాం లింకన్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్‌ టి.జానకీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top