నాణ్యమైన రొయ్యల ఉత్పత్తే లక్ష్యం

Committee with shrimp farmers, seed, feed and processing operators - Sakshi

రొయ్యరైతులు, సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్‌ ఆపరేటర్లతో కమిటీ 

సీడ్‌ నుంచి పట్టుబడి వరకు దశలవారీగా పరీక్షలు 

యాంటిబయోటిక్స్‌ అవశేషాల్లేకుంటేనే కొనుగోలు 

సాక్షి, అమరావతి: ఆక్వాసాగులో యాంటిబయోటిక్స్‌ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా యాంటిబయోటిక్స్‌ వినియోగాన్ని 95 శాతానికిపైగా నియంత్రించగలిగారు. ఇకముందు 100 శాతం నియంత్రించేదిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్‌ శాతాన్ని పరీక్షించేలా కార్యాచరణ సిద్ధం చేసింది.

రాష్ట్రంలో ఏటా తొమ్మిదిలక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. లక్షటన్నులు స్థానికంగా వినియోగమవుతుండగా, లక్షన్నర టన్నులు ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వెళుతున్నాయి. మిగిలిన 6.50 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీన్లో 50 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 30 శాతం చైనాకు, 10 శాతం వియత్నాం, థాయ్‌లాండ్‌ దేశాలకు, 6–8 శాతం యూ­రప్‌ దేశాలకు, మిగిలింది మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

యాంటిబయోటిక్‌ రెసిడ్యూల్స్‌ మితిమీరి ఉన్నాయంటూ ఒకప్పుడు పెద్ద ఎత్తున కన్‌సైన్‌మెంట్స్‌ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్‌ అందించే లక్ష్యంతో ఏపీ సడా, సీడ్, ఫీడ్‌ యాక్టులు తీసుకురావడంతోపాటు తీరప్రాంత జిల్లాల్లో రూ.50 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఆర్బీకే చానల్‌ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన 
ఆక్వాసాగు వివరాలను ఈ ఫిష్‌ యాప్‌లో నమోదుచేస్తూ, నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా పెద్ద ఎత్తున మత్స్యసాగుబడులు నిర్వహిస్తున్నారు. యాంటిబయోటిక్స్‌ వినియోగంవల్ల తలెత్తే దుష్పరిణామాలపై ఆర్బీకే చానల్‌ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తున్నారు. పంటకాలంలో కనీసం నాలుగైదుసార్లు వాటర్‌ అనాలసిస్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడమే కాదు.. పొరుగు రాష్ట్రాలు, దేశాలతో పోల్చుకుంటే రొయ్యల ఎదుగుదల 12.76 శాతం మేర పెరిగింది.

మరోవైపు యాంటిబయోటిక్స్‌ వినియోగం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి విదేశాలకు పంపే రొయ్యల్లో యాంటిబయోటిక్స్‌ అవశేషాలు 0.3 నుంచి 0.4 శాతం ఉంటే, మన రాష్ట్రం నుంచి వెళ్లే వాటిలో 0.2 శాతం మాత్రమే నమోదవుతున్నాయి. అవికూడా కొద్దిపాటి కన్‌సైన్‌మెంట్‌లలోనే. ఈక్విడార్‌ వంటి దేశాల్లో ప్రతి ఉత్పత్తిని టెస్ట్‌ చేసిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతినిస్తారు. అదే మనదేశంలో ర్యాండమ్‌గా చెక్‌చేసిన తర్వాత ఎగుమతులకు అనుమతినిస్తుంటారు.

వ్యాధుల నియంత్రణ పేరుతో విచ్చలవిడిగా వినియోగిస్తున్న యాంటిబయోటిక్స్‌ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాంటిబయోటిక్స్‌ అవశేషాలుంటే ఇకనుంచి రొయ్యలను కొనుగోలు చేయబోమని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రాసెసింగ్‌ ఆపరేటర్లు, ఎక్స్‌పోర్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నూరుశాతం యాంటిబయోటిక్స్‌ రహిత ఉత్పత్తులుగా మన రొయ్యలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈక్విడార్‌ తరహాలోనే నూరుశాతం తనిఖీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందుకోసం సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్‌ ఆపరేటర్లతోపాటు రైతుసంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ పర్యవేక్షణలో సీడ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్‌ అవశేషాలను క్రమం తప్పకుండా పరీక్షించనుంది. ప్రస్తుత సీజన్‌ నుంచే ఈ కార్యాచరణ అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యాంటిబయోటిక్స్‌ పరీక్షలకు అయ్యే వ్యయం రైతులపై పూర్తిగా పడకుండా సమష్టిగా భరించేలా ఏర్పాటు చేస్తోంది.  

యాంటిబయోటిక్స్‌ నియంత్రణే లక్ష్యం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యాంటిబయోటిక్స్‌ వినియోగం నూరుశాతం నియంత్రణే లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ రైతుల్లో అవగాహన కల్పించడమే కాదు.. సీడ్‌ నుంచి పట్టుబడి వరకు దశలవారీగా ప్రతి చెరువులోని రొయ్యలను పరీక్షిస్తుంది.  
– వడ్డి రఘురాం, అప్సడా వైస్‌ చైర్మన్‌ 

కమిటీ ఏర్పాటు మంచి ఆలోచన 
యాంటిబయోటిక్స్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. యాంటిబయోటిక్స్‌ లేని రొయ్యలను మాత్రమే ఎగు­మ­తి చేసేందుకు ఇది ఎంతో దోహదపడనుంది.  
– ఐ.పి.ఆర్‌.మోహనరాజు, జాతీయ రొయ్యరైతుల సంఘం అధ్యక్షుడు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top