ఖరీదైనా.. కొంటున్నాం

CM YS Jagan review with power department officials - Sakshi

విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

2 నెలల్లో రూ.2,150 కోట్లు.. రోజూ దాదాపు రూ.40 కోట్లు వ్యయం

వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు

వ్యవసాయ, గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో సరఫరా

వ్యవసాయ మోటార్లకు మీటర్లు ప్రయోగం శ్రీకాకుళంలో సక్సెస్‌

రాష్ట్రమంతటా అమలుకు చర్యలు

ఉచిత విద్యుత్‌ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేసేలా ఏర్పాట్లు

రైతులే బిల్లులు చెల్లించడం వల్ల నాణ్యమైన సేవలకు ప్రశ్నించే హక్కు

డిస్కమ్‌లు, విద్యుత్‌ సిబ్బందిలో పెరగనున్న జవాబుదారీతనం 

విద్యుదుత్పత్తి రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కీలక మార్పులు

థర్మల్‌ ప్లాంట్లకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి

పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టులతో భవిష్యత్‌కు భరోసా 

దేశమంతా బొగ్గుకు తీవ్ర కొరత.. రెండేళ్లు ఇవే పరిస్థితులని కేంద్రం సంకేతాలు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో కరెంట్‌ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ఇంధన శాఖపై సమీక్ష సందర్భంగా ఉన్నతాధికారులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదించారు. గత రెండు నెలల్లో సుమారు రూ.2,150 కోట్లు వ్యయం చేసి గృహ, వ్యవసాయ విద్యుత్‌ అవసరాలకు పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు వివరించారు. మార్చిలో 1,268.69 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేయగా ఏప్రిల్‌లో 1,047.78 ఎంయూలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. బొగ్గు కొనుగోలు విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో మళ్లీ ఇబ్బందులు రాకుండా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌–సరఫరా, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న వాటిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు.  సమీక్షలో ముఖ్యాంశాలివీ..
విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

దేశ వ్యాప్తంగా బొగ్గు సంక్షోభం
దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. బొగ్గు సరఫరాలో అంతరాయంతో పలు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందన్నారు. సరిపడా రైల్వే ర్యాక్స్, వెసల్స్‌(నౌకలు) అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో బొగ్గు ధరలు భారీగా పెరగడం తదితర కారణాలన్నీ విద్యుత్‌ కొరతకు దారితీశాయని వివరించారు. మరోవైపు విద్యుత్‌ వినియోగం గతంలో కంటే అనూహ్యంగా పెరిగిందన్నారు. మూడేళ్లుగా సమృద్ధిగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగం నుంచి డిమాండ్‌ స్థిరంగా ఉందని చెప్పారు. కోవిడ్‌ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి రంగం పుంజుకోవడంతో డిమాండ్‌ పెరిగిందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉండటంతో ఏప్రిల్‌ 8న విద్యుత్‌ డిమాండ్‌ 12,293 మిలియన్‌ యూనిట్లకు చేరిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వెల్లడించారు.

డిమాండ్‌ అంచనాలతో కార్యాచరణ
గత మార్చిలో విద్యుత్తు కొనుగోలుకు రూ.1123.74 కోట్లు, ఏప్రిల్‌లో రూ.1022.42 కోట్లు వెచ్చించినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. బొగ్గు విషయంలో రానున్న రెండేళ్లు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని కేంద్రం నుంచి సంకేతాలు అందాయని, ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం విదేశాల నుంచి తెచ్చుకోవాలని సూచిస్తున్న విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కొద్ది రోజుల్లో వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ తగ్గి ఆ మేరకు అందుబాటులోకి వచ్చి కొరత తీరినప్పటికీ వచ్చే ఏడాది మళ్లీ ఇవే పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని సూచించారు. భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేసి ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. 

సెకీ, ధర్మల్‌ విద్యుత్‌
సెకీతో ఒప్పందం వల్ల సుమారు 45 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ రాష్ట్రానికి మూడేళ్లలో మొత్తం మూడు దశల్లో అందుబాటులో వస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. 2023 చివరి నాటికి మొదటి దశలో సుమారు 18 మిలియన్‌ యూనిట్లు, ఆ తరువాత రెండో దశలో 18 మిలియన్‌ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్‌ యూనిట్లు చొప్పున అందుబాటులోకి రానుందని వెల్లడించారు. దీంతోపాటు కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల చొప్పున ధర్మల్‌ విద్యుత్‌ యూనిట్లు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. 85 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) అంచనా ప్రకారం మరో 30 మిలియన్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా రాష్ట్రంలో పీక్‌ అవర్స్‌లో సైతం మిగులు విద్యుత్తు ఉండే పరిస్థితులు ఏర్పడనున్నాయని చెప్పారు. 

పరిశ్రమలకు నిరంతర విద్యుత్తుపై కార్యాచరణ..
పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు పడకుండా నివారించాలన్నారు. డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్తు సరఫరా చేసేందుకు పారిశ్రామిక రంగ ప్రముఖులు, నిపుణులతో కలసి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వచ్చే వేసవిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు
జెన్‌కో ఆధ్వర్యంలోని ప్లాంట్లను అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 85 శాతం పీఎల్‌ఎఫ్‌ సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు చేపట్టడం వల్ల నాణ్యమైన విద్యుత్తు చౌక ధరకే అందుబాటులోకి వస్తుందన్నారు. విద్యుదుత్పత్తి ఖర్చులు తగ్గించడంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఖర్చులను నియంత్రించగలిగినా ఆదాయం సమకూరినట్లేనని స్పష్టం చేశారు. 

ప్రత్యామ్నాయం.. పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టులు 
పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలకు భరోసా కలుగుతుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు వస్తున్నాయని, పర్యావరణ అనుకూల విధానాలతో విద్యుత్‌ ఉత్పత్తి జరగాలన్నారు. బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి ఇతర మార్గాల వైపు ప్రపంచం మళ్లుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ విధానాలు అవసరమన్నారు. పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు విద్యుత్‌ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారించి భూ సేకరణ నుంచి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. పీక్‌ అవర్స్‌లో అధిక ధరలతో విద్యుత్తు కొనుగోలు చేయాల్సి రావడం లాంటి ఇబ్బందులు పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టుల వల్ల తొలగిపోతాయని చెప్పారు. ఒకసారి ప్రాజెక్టు స్థాపించిన తర్వాత గరిష్టంగా 90 ఏళ్లపాటు ఈ కరెంట్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

శరవేగంగా సీలేరు ప్రాజెక్టు 
సీలేరులో కొత్తగా చేపట్టిన 1,350 మెగావాట్ల ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. డీపీఆర్‌ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు జూలై–ఆగస్టు కల్లా వినియోగదారులకు అందనుందని పేర్కొనగా విజయవాడ థర్మల్‌ కేంద్రంలో కూడా 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. పోలవరం పవర్‌ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే టన్నెళ్ల తవ్వకం పూర్తైందని, దీనివల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తును సాధించగలుగుతామని అధికారులు పేర్కొన్నారు.

శ్రీకాకుళంలో పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం
శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చడం విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. 2020–21లో జిల్లాలో 26,083 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా 2021– 22 నాటికి 28,393కి పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రమంతటా ఈ విధానం అమలును వేగవంతం చేసి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా ఉచిత విద్యుత్‌ డబ్బులను రైతుల ఖాతాల్లోకే జమ చేయాలని సీఎం జగన్‌  ఆదేశించారు. ఉచిత విద్యుత్‌ వినియోగానికి సంబంధించి రైతులే నేరుగా డిస్కమ్‌లకు చెల్లించడం వల్ల సేవల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే పంపిణీ సంస్థలను, సిబ్బందిని ప్రశ్నించగలుగుతారని చెప్పారు. విద్యుత్తు శాఖ కూడా రైతుల అభ్యంతరాలు, సమస్యల పరిష్కారంపై నిరంతరం ధ్యాస పెట్టగలుగుతుందని, తద్వారా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నాణ్యమైన కరెంటు సరఫరాతోపాటు రైతులకు మంచి సేవలు అందుతాయన్నారు. 

చెప్పిన దానికంటే మిన్నగా వైఎస్సార్‌ జలకళ 
వైఎస్సార్‌ జలకళ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం సూచించారు. మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ మోటారు ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల విలువైన విద్యుద్దీకరణ పనులను కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. రైతులకు దీనివల్ల మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సమీక్షలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇంధనశాఖ కార్యదర్శి(ఎఫ్‌ఏసీ), ఏపీజెన్‌కో ఎండీ బి.శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ ఎన్‌వి రమణారెడ్డి, డిస్కమ్‌ల సీఎండీలు తదితరులు పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top