ఇక టాప్‌ గేర్‌..! | CM YS Jagan Direction To MLAs, MLCs And In-charges Over Elections In AP - Sakshi
Sakshi News home page

ఇక టాప్‌ గేర్‌..!

Published Wed, Sep 27 2023 4:49 AM | Last Updated on Wed, Sep 27 2023 8:10 AM

CM YS Jagan direction to MLAs, MLCs and in-charges on Elections - Sakshi

ప్రజల్లో... ఎవరికి ఇస్తే సరైంది? అనే ప్రతిపాదికనే టిక్కెట్లు ఇస్తా. టికెట్టు ఇవ్వనంత మాత్రాన.. ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడని అనుకోవద్దు. టికెట్‌ ఇస్తే అది ఒక బాధ్యత. టికెట్‌ వచ్చినా, రాకున్నా మీరు ఎప్పటికీ నా వాళ్లుగానే ఉంటారు. అది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. జుత్తు ఉంటేనే ముడివేసుకోగలం. అధికారంలో ఉంటేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. టికెట్‌ ఇవ్వలేని పక్షంలో వారికి మరొకటి ఇస్తా. లీడర్‌ మీద, పార్టీ మీద నమ్మకం ఉంచాలి. అప్పుడే అడుగులు సరైన మార్గంలో పడతాయి. టికెట్ల విషయంలో నేను తీసుకోబోయే నిర్ణయాలకు అందరూ పెద్ద మనసుతో సహకరించాలి.   
 – సీఎం వైఎస్‌ జగన్‌   

సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాలు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఇక మనం గేర్‌ మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ నేతలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఇన్ని రోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఒక ఎత్తు కాగా శాసనసభ సమావేశాలు ముగిశాక నిర్వహించే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమయ్యే తీరు ఇంకొక ఎత్తు అని పేర్కొన్నారు.

ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా..! వచ్చే ఆరు నెలలు సరిగా పని చేయకపోయినా పర్వాలేదనే భావన సరి కాదని హితవు పలికారు. రానున్న ఆర్నెల్లు్ల ఎలా పని చేస్తామన్నదే చాలా ముఖ్యమైన విషయమని, ఇది మనసులో పెట్టుకుని ప్రతి అడుగూ ముందుకు  వేయాలని పార్టీ నేతలకు సూచించారు.

మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే కావాలి (వై ఏపీ నీడ్స్‌ జగన్‌) అనే పేరుతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై వచ్చే రెండు నెలల్లో నిర్వహించే ప్రచారంపై చర్చించారు. ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరుపై పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  
సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు     

సాధ్యమేనని నేను గతంలోనే చెప్పా
నేను ఇంతకు ముందే చెప్పా.. 175కు 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు? వైనాట్‌ 175? ఇది సాధ్యమే.  క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఇది సాధ్యం. మనం క్షేత్ర స్థాయిలో అంత బలంగా ఉన్నాం కాబట్టే ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేయలేక, భయపడి పొత్తులకు వెళ్తున్నాయి.

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మన పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల సానుకూల స్పందనను మీరంతా కళ్లారా చూశారు. ప్రతి ఇంటికీ మీరు వెళ్లినప్పుడు, అక్కచెల్లెమ్మలకు లేఖలను అందించినప్పుడు వారిలో వచ్చిన స్పందనను మీరు చూశారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే ముందు చూపు, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలి.

అందుకనే ఇంతకుముందు చేసిందంతా ఒక ఎత్తు, ఈ ఆరు నెలల్లో మనం చేయబోయేది మరొక ఎత్తు! ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరపుతూ వారితో  మమేకమై ఉండడం ఒక ముఖ్యమైన విషయం కాగా.. ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహాలు మరొక ముఖ్యమైన అంశాలు. వీటికి సంబంధించిన ప్రతి అడుగు రాబోయే రోజుల్లో వేయాలి.

రాబోయే రోజుల్లో పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఇంకా క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ప్రతి నియోజక వర్గంలో  విభేదాలు లేకుండా చూసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. గ్రామ, మండల స్ధాయి నాయకుల్లో ఎలాంటి విభేదాలున్నా వాటిన్నింటినీ పరిష్కరించుకుని, సమన్వయపర్చుకుని అడుగులు వేయించాలి. వచ్చే ఆర్నెల్లు్ల వీటిపై దృష్టి పెట్టాలి.   

సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు     

ప్రజల్లో.. ఎవరికిస్తే సరైందనే ప్రాతిపదికనే టికెట్లు.. 
మరో విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం అంతా ఒక కుటుంబంలో సభ్యులమే. చాలామందికి తిరిగి టికెట్లు రావొచ్చు.. కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. ప్రజల్లో మీరు ఉన్న పరిస్థితులను బట్టి.. మనం వేసే అడుగులు బట్టి.. ఏది కరెక్ట్‌? ఎవరికి ఇస్తే కరెక్టు? అనే ప్రాతిపదికన నిర్ణయాలను తీసుకోవచ్చు. సర్వేలు కూడా దాదాపు తుది దశలోకి వస్తున్నాయి. చివరి దశ సర్వేలు కూడా జరుగుతుంటాయి. రానున్న రెండు నెలలు అందరూ ఎంత ఎక్కువగా ప్రజల్లో ఉంటే అంత మంచి ఫలితాలు మీపట్ల వస్తాయి. అందుకనే ప్రజల్లో మమేకమై ఉండండి.   

2 నెలలు.. 2 భారీ కార్యక్రమాలు
వచ్చే రెండు నెలలకు సంబంధించి రెండు భారీ కార్యక్రమాలను చేపడుతున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే కావాలి అనే కార్యక్రమాలను పార్టీ నుంచి చేపడుతున్నాం. ఏపీకి జగనే కావాలి కార్యక్రమం ద్వారా గత నాలుగేళ్లకుపైగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చాలా స్పష్టంగా చూపిస్తాం. గతంలో మనం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం చాలా సానుకూల ఫలితాలను ఇచ్చింది. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చాం. లబి్ధదారులందరినీ జల్లెడ పట్టి వారందరికీ సహాయ, సహకారాలు అందిస్తూ మంచి చేయగలిగాం. అర్హులైనవారికి అవసరమైన ధ్రువపత్రాలను జారీచేశాం. దీనిలాగే ఆరోగ్య సురక్షను చేపడుతున్నాం.  

ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష..
► జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్య పరంగా ప్రతి ఇంటినీ జల్లెడపడతాం. ప్రతి ఇంట్లోనూ పరీక్షలు చేస్తాం. ఉచితంగా మందులు ఇస్తాం. గుర్తించిన వారికి చేయూతనిచ్చి వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం. నయం అయ్యేంతవరకూ విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్టతో వారికి చేయూతనిస్తాం. ఇది కూడా మరొక విప్లవాత్మకమైన కార్యక్రమం. ఇందులో ప్రజా ప్రతినిధులను, పార్టీ శ్రేణులను మమేకం చేస్తాం. 

► మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్షకార్య­క్రమం జరుగుతుంది. మొదటి దశలో వలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు. 

► రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికీ పరీక్షలు చేయడానికి వెళ్తారు. ఆరోగ్యశ్రీని ఎలా ఉపయోగించుకోవాలి? అన్న దానిపై కూడా అవగాహన కల్పిస్తారు. 

► మూడో దశలో వలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు ఏర్పాటు తేదీ, వివరాలు తెలియజేస్తారు. క్యాంపు కన్నా మూడు రోజులు ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. 

► నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని తర్వాత ఐదో దశలో అనా­రోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారికి నయం అయ్యేంతవరకూ చేయూత నిస్తారు. ఇప్పటికే కార్యక్రమం మొదలయ్యింది. పూర్తిస్థాయి అవగాహనకోసం ఈ వర్క్‌షాపు నిర్వహిస్తున్నాం. ఈ రెండు కార్యక్రమాల్లో కేడర్‌ను, గ్రామస్ధాయిలో ప్రజా ప్రతినిధులను, వలంటీర్లను పాల్గొనేలా ఇన్‌వాల్వ్‌ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలి. 

► నవంబర్‌ చివరికి గడప గడపకూ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో మమేకం కావాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement