
మహానాడు ఆద్యంతం ఆత్మస్తుతి, పరనిందే
వైఎస్ జగన్‌పై, గత ప్రభుత్వంపై అభాండాలకే అధిక ప్రాధాన్యత
చంద్రబాబు మొదలు నేతలందరి మాటల్లోనూ విషం
లోకేశ్ ఆరు శాసనాలపై శ్రేణుల పెదవి విరుపు
సూపర్ సిక్స్ ఉండగా ఇవెందుకని సందేహం
ఏడాదిలో చేసిందేమీలేక సొంత డబ్బాకే పరిమితం
ఒక్కటంటే ఒక్కటి చేశామని ధైర్యంగా చెప్పలేకపోయిన చంద్రబాబు
పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి ఆవేశపూరిత ప్రసంగం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిందేమీ లేకపోవడంతో సీఎం చంద్రబాబు.. ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై విషం కక్కడానికే సమయమంతా వెచ్చించారు. మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ.. కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పంథాను కొనసాగించింది.
సూపర్ సిక్స్ హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్క దాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని లేనివి ఉన్నట్లు మహానాడులో చిత్రీకరించారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది.
సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్ సిక్స్ శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి.. ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్‌తో చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్ సిక్స్ శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకువస్తామని ఇప్పుడు ప్రకటించారు.
ఇచ్చిన హామీలకే దిక్కు లేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేశ్ శాసనాలంటూ సరికొత్త పద ప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి, మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు.. ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
గత ప్రభుత్వం అంటూ అదే పనిగా విషం
చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలంతా గత ప్రభు త్వం, జగన్ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడేదో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్ కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సివస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఇక రాష్ట్రానికి తాను చేసేదేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్రహింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతున్నట్లు అర్థమవుతోంది.
పార్టీ కార్యకర్తల మనసుల్లో విద్వేషం నింపి వారిని పగతో రగిలేలా చేయడం కోసమే గత ప్రభుత్వంపై అభాండాలు మోపడాన్ని చంద్రబాబు ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాన్ని మహానాడులోనూ కొనసాగించారు. ఇందులో భాగంగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని సీఎం ఎలా చెబుతారని ప్రజలు మండిపడుతున్నారు.
తండ్రీ కొడుకులపై పొగడ్తలు
ఎన్టీఆర్ హయాంలో సంస్కరణలు అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని అభివృద్ధి చేశామని, 2014–19లో ఇరగదీశామని ఇంకా పాత కథలు చెప్పుకోవడానికే చంద్రబాబు సహా నేతలంతా ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు పార్టీ నేతలంతా చంద్రబాబును, ఆయన కొడుకు, మంత్రి లోకేశ్‌ను పొగడటానికే పోటీపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంది నేతలు భూ ప్రపంచంలో చంద్రబాబు, లోకేశ్ అంత గొప్ప వారు ఎవరూ లేరన్న రీతిలో కీర్తించారు.

‘మహా’కష్టాలు
» నేలకూలిన కటౌట్లు.. పరుగులు తీసిన కార్యకర్తలు
» మధ్యాహ్న భోజనాల దగ్గర తోపులాట
» పార్టీ శ్రేణులు లేక బోసిపోయిన ప్రాంగణం
» నిర్వాహకులపై బాబు సీరియస్
» మీడియాపై లోకేశ్ ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, కడప/కడప రూరల్: తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేలకొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడటంతో పార్కింగ్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే ఇద్దరు వీఆర్వోలు గాయపడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంత మంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు.
‘ఏమి ఏర్పాట్లో.. ఏమి కమిటీలో.. కనిపిస్తూనే ఉంది’ అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కాగా, మధ్యాహ్నం భోజన సమయానికి మహానాడు ప్రాంగణం సగం ఖాళీ కాగా, సాయంత్రానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు నిర్వాహకులపై సీరియస్ అయినట్లు సమాచారం. చివరగా మాట్లాడిన చంద్రబాబు.. చివరి వరకూ ఉండాలని, దీనిని బుధవారం నుంచైనా పాటించాలని కోరడం గమనార్హం. మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు. లోకేశ్ అక్కడికి రాగానే.. కెమెరాలు ఆఫ్ చేయాలంటూ ఆదేశించారు.
ఎవరైనా కెమెరా ఆన్ చేస్తే లాక్కొవాలంటూ పోలీసులకు సూచించారు. ఫొటోలు కూడా తీయనివ్వలేదు. మంత్రి లోకేశ్ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్‌చాట్ నిర్వహించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ అధికారులకు డ్యూటీలు వేశారు. జిల్లా సర్వోన్నతాధికారి డ్యూటీ పాస్‌లు ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు ఎల్లో ట్యాగు తగలించుకొని కనిపించారు. కాగా, మహానాడుకు ముందే కరోనా పాజిటివ్ కేసులు రిమ్స్‌లో నమోదు అయితే, అబ్బే అలాంటిదేమీ లేదని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు.