
ముఖ్యమంత్రి చైర్మన్‌గా పీ4 ఫౌండేషన్
పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై త్వరలో ప్రత్యేక పాలసీ
ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ సామర్థ్యం పెంపుదలపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి కార్యదర్శి వరకు ప్రతిఒక్కరికీ దీనిపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై సీఎం బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వచ్చే నెలకల్లా నియోజకవర్గాల విజన్ ప్లాన్..
స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం చేరుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధంకాగా.. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ వచ్చేనెలకల్లా రూపొందించనున్నారు. పీ–4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సీఎం చైర్మన్‌గా స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్ ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు.. జనాభా నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకురానుంది.
స్పేస్–డిఫెన్స్ ప్రాజెక్టులకు నూతన పాలసీ.!
రాష్ట్రంలో అంతరిక్ష, రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్ టెక్నాలజీ అడ్వయిజర్‌గా ఉన్న ఎస్.సోమనాథ్, డీఆర్డీవో మాజీ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ఏరోస్పేస్–డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డితో చర్చించారు. స్పేస్–డిఫెన్స్ పాలసీల రూపకల్పనతో పాటు, ఈ రెండు రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు పొందేలా చురుకైన పాత్ర పోషించాలని వారికి సూచించారు.