8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌’ | Chief Minister Chandrababu Naidu reviews NITI Aayog meeting | Sakshi
Sakshi News home page

8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌’

Jun 7 2025 2:55 AM | Updated on Jun 7 2025 2:55 AM

Chief Minister Chandrababu Naidu reviews NITI Aayog meeting

2032 నాటికి 120 బిలియన్‌ డాలర్ల సంపద సృష్టి  

మూలపేట–కాకినాడ మధ్య బీచ్‌ రహదారి అభివృద్ధి 

20 లక్షల మందికి ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ కార్యాచరణ 

నీతి ఆయోగ్‌ సమావేశంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని ఆదేశం    

సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌’ను ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్‌ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని,  2032 నాటికి 120 బిలియన్‌ డాలర్ల సంపద సృష్టి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనమిక్‌ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని పేర్కొన్నారు. 

వీటి కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ‘మూలపేట–విశాఖపట్నం, విశాఖపట్నం–కాకినాడ మధ్య బీచ్‌ రహదారులు నిర్మిస్తామని, వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని సీఎం చెప్పారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని యత్నిస్తున్నామని సీఎం చెప్పారు.  శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంపై సమీక్షలో ‘విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఆరు పోర్టులు, ఏడు మాన్యుఫాక్చరింగ్‌ నోడ్లు, 17 మేజర్‌ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్‌ హబ్స్, 12 పర్యాటక హబ్స్‌తో విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్టు సీఎం చెప్పారు. దీనిపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  అనంతరం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ రోడ్‌ మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీతి ఆయోగ్, ఐఎస్‌ఈజీ ఫౌండేషన్‌ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రమణ్యం, సీఎస్‌ విజయానంద్‌ పాల్గొన్నారు.  

హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల 
హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడానికి జలహారతి కార్పొరేషన్‌ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశామని చెప్పారు. 

రూ.81,900 కోట్ల వ్యయంతో 50 శాతం రూ.40,950 కోట్లు ఈఏపీ(విదేశీ) రుణం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌గా 20 శాతం రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం రూ.8,190 కోట్లు, హ్యామ్‌(హైబ్రిడ్‌ యాన్యుటీ) విధానంలో మరో 20 శాతం రూ.16,380 కోట్లు ఖర్చు చేసేలా అధికారులు చేసిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు.   

Advertisement
 
Advertisement
Advertisement