శారీరక శ్రమతోనే ఎన్‌సీడీ సమస్యలకు చెక్‌

Check for NCD problems with physical activity - Sakshi

నడక, వ్యాయామాలకు విద్యాసంస్థలు సహకరించాలి 

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు 

సాక్షి, అమరావతి: బీపీ, షుగర్, ఇతర నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) నుంచి బయటపడడానికి నడక, వ్యాయామం వంటి శారీరకశ్రమే శరణ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్, సాంకేతిక విద్యాసంస్థల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎన్‌సీడీ సమస్యల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను డ్రైవ్‌లా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.

రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నడక, వ్యాయామాలు చేసుకోవడానికి వీలుగా స్థలాలు, క్రీడామైదానాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనిపై విద్యాసంస్థల యాజమాన్యాలు రెండు, మూడురోజుల్లో తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలపాలని కోరారు. రాష్ట్రంలో 1990లో 30 శాతం ఉన్న ఎన్‌సీడీ ప్రభావం ప్రస్తుతం 63 శాతానికి పెరిగిందని చెప్పారు.

రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్‌సీడీ సమస్యలే ప్రధాన కారణమన్నారు. ఈ క్రమంలో ఎన్‌సీడీ సమస్యల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 30 ఏళ్లు పైబడిన వారికి వైద్యశాఖ స్క్రీనింగ్‌ చేసి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రతి ఐదుగురిలో ఒకరు బీపీ/షుగర్‌తో ఉన్నట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కమిషనర్‌ సురేష్‌బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ నివాస్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ డాక్టర్‌ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top