బాబు లెక్కలేని ఖర్చు.. రూ.1.62 లక్షల కోట్లు 

Central Finance Department On Chandrababu TDP Govt - Sakshi

చంద్రబాబు అడ్డగోలు వ్యవహారాన్ని బయటపెట్టిన కేంద్రం 

నాటి ఐదేళ్ల పాలనలో 1.62 లక్షల కోట్ల ఖర్చుకు వివరాలు మాయం 

లెక్కలు చూపించమని కాగ్‌ అడిగినా రూ.51 వేల కోట్లకే వివరణలు 

మిగతా 1.11 లక్షల కోట్ల సంగతి ఇప్పటికీ తేలలేదని స్పష్టంచేసిన కేంద్ర ఆర్థిక శాఖ 

టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానం

దీన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు ప్రయత్నించిన కనకమేడల 

వైఎస్సార్‌సీపీ హయాంలో 1.10 లక్షల కోట్ల ఖర్చుకు లెక్కలడిగిన టీడీపీ ఎంపీ 

ఈ 1.62 లక్షల కోట్ల లెక్కలేని ఖర్చు 2014–19 మధ్యనే జరిగిందన్న కేంద్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని, ఎక్కువ అప్పులు చేస్తోందని గగ్గోలు పెడుతున్న తెలుగుదేశం పార్టీ అసలు రంగు బయట పడింది. రాజ్యసభ సాక్షిగా.. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏకంగా రూ.1.62 లక్షల కోట్లకు లెక్కల్లేవని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ‘కాగ్‌’ స్వయంగా ఈ విషయం బయటపెట్టిందని, పదేపదే అడిగినా సరే ఐదేళ్ల కాలంలో కేవలం రూ.51,667 కోట్లకు మాత్రమే వివరణలు ఇచ్చారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

రాష్ట్ర విభజన తరవాత 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ 1,62,828 కోట్ల ఖర్చును ఖర్చు చేసినట్లుగా చూపించిందని, కానీ దీనికి లెక్కలు మాత్రం ఇప్పటికీ లేవని కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి స్పష్టంచేశారు. ‘‘బడ్జెట్‌ కేటాయింపుల్లేకుండా 2014–15 నుంచి 2018–19 మధ్య టీటీపీ ప్రభుత్వం ఏకంగా రూ.1,62,828.70 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించింది. కానీ ఆ వ్యయానికి తగిన అనుమతులు గానీ, వ్యయం వివరాలు గానీ లేవు. ఈ విషయాన్ని 2020లో ఇచ్చిన నివేదికలో కాగ్‌ స్పష్టం చేసింది.  

రూ.51,677.74 కోట్లకు మాత్రమే వివరాలు ఇవ్వగలిగారు. మిగిలిన మొత్తానికి ఇప్పటికీ లెక్కల్లేవు’’ అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తన సమాధానంలో స్పష్టంగా వివరించారు. రాజ్యాంగంలోని 205 అధికరణ ప్రకారం.. అదనపు వ్యయంగా చూపిస్తున్న మొత్తానికి శాసనసభ ఆమోదం తప్పనిసరి అని ఉన్న నిబంధనను టీడీపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. 

తాను తీసిన గోతిలో... 
కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించటం కూడా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. ఎందుకంటే టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ పార్లమెంటులో కేంద్రాన్ని ఓ ప్రశ్న అడిగారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 1.10 లక్షల కోట్లను లెక్కలు లేకుండా ఖర్చు చేశారని చెబుతూ... ఇది నిజమేనా? నిజమైతే ఎందుకు జరిగింది? దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంది? ఒకవేళ ఏ చర్యా తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు? అని అడిగారు. దీనికి కేంద్రం సమాధానమిస్తూ... ఈ లక్షా అరవైరెండు వేల కోట్ల లెక్కల్లేని వ్యయం 2014 నుంచి 2019 మధ్య జరిగిందని తేల్చి చెప్పింది. దీనిపై తాము వివరాలడిగినా సరే ఇప్పటికీ రాలేదని కూడా మంత్రి పేర్కొనటం గమనార్హం. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని భావించిన టీడీపీ ఎంపీ... తమ దారుణాన్ని తామే బయటపెట్టుకున్నారు. తప్పంతా తాము చేసి... ఇతరులపైకి నెట్టేయాలనుకుంటే ఇలాగే జరుగుతుందని వ్యవహారం తెలిసిన వారంతా వ్యాఖ్యానించటం గమనార్హం. 

బాబును చెప్పుతో కొట్టారు: విజయసాయిరెడ్డి 
రాష్ట్రం శ్రీలంకలా మారిందని దుష్ప్రచారం చెయ్యాలని, ఈ రకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేంద్రాన్నే లెక్కలడగాలని భావించిన తెలుగుదేశం పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ బండారాన్ని కేంద్రం బయటపెట్టిందని, చంద్రబాబు చెప్పుతో చంద్రబాబునే కొట్టినట్లయిందని వ్యాఖ్యానించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top